SVR Jayanthi | ఎస్వీఆర్ జ‌యంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి

SVR Jayanthi | ఎస్వీఆర్ జ‌యంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి

SVR Jayanthi | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలుగు సినీ చరిత్రలో తన అసాధారణ నటనతో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు సామర్ల వెంకట రంగారావు (ఎస్వీఆర్) జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించిన సీఎం, తెలుగు చలనచిత్ర రంగానికి ఎస్వీఆర్ అందించిన సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తన సందేశంలో.. సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషిస్తూ నవరసాలను అద్భుతంగా ఆవిష్కరించిన నటుడిగా ఎస్వీఆర్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. తన విలక్షణ నటన, భావ వ్యక్తీకరణ, పాత్రలో ఒదిగిపోయే తీరు ఆయనను భారతీయ సినీ చరిత్రలో అజరామరుడిగా నిలబెట్టాయని అన్నారు. ఎస్వీఆర్ జయంతి సందర్భంగా ఆ మహానటుడి స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తరతరాల నటులకు ఆయన నటన ఆదర్శంగా నిలుస్తూనే ఉంటుందని, తెలుగు సినీ రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.