AP News | చంద్రబాబుపై సజ్జల తీవ్ర విమర్శలు
AP News | చంద్రబాబుపై సజ్జల తీవ్ర విమర్శలు
అమరావతి దుబారా ప్రాజెక్టుగా మారిందని ఆరోపణ
మావిగన్ ఒక్కటే అజెండా కాదన్న వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి
రైతుల సమస్యలను ప్రశ్నిస్తున్నది వైఎస్సార్సీపీయేనని వ్యాఖ్య
AP News | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : అమరావతి రాజధాని పేరుతో భారీ అవినీతి జరుగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతి నిర్మాణంలో జరుగుతున్న అవినీతిపై తాము ఆధారాలతో సహా వివరాలు బయటపెట్టినా, వాటిపై చర్చ జరగకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు.
చంద్రబాబు చేస్తున్న అవినీతికి అడ్డుకట్ట వేయడానికే ‘మావిగన్’ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని సజ్జల తెలిపారు. మావిగన్ తమకు హానికరమైతే టీడీపీ ఎందుకు ఉలిక్కిపడుతోందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మావిగన్ ఒక్కటే తమ అజెండా కాదని, ప్రజలకు సంబంధించిన అనేక అంశాలతో ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు. అమరావతికి వాస్తవ రూపం రాదనే విషయం చంద్రబాబుకు కూడా తెలుసని, ఇది రాష్ట్రాన్ని ముంచే దుబారా ప్రాజెక్టుగా మారిందని ఆరోపించారు.

అమరావతి ఆర్థికంగా నిలదొక్కుకునే (వయబుల్) ప్రాజెక్టు అని ఇప్పటికీ ప్రభుత్వం నిరూపించలేకపోయిందని సజ్జల పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు మినహా ఇతర పెద్ద ప్రాజెక్టులు అక్కడికి రావడం లేదని, భూములు ఇచ్చిన రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ బయటకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. అమరావతికి తమ పార్టీ వ్యతిరేకమైతే రైతుల పెన్షన్లు ఎందుకు పెంచుతామని ప్రశ్నించిన ఆయన, రైతుల సమస్యలను ప్రశ్నిస్తున్నది వైఎస్సార్సీపీ మాత్రమేనని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
