అమరావతి: సింహాచలం లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సింహాచలం ఆలయంలో జరిగిన తీవ్ర విషాద ఘటనపై వెంటనే స్పందించి సకాలంలో ఏపీ హోంమంత్రి అనిత చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సింహాచలంలో హోంమంత్రి అనిత చేసిన సేవలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు హోంమంత్రి వంగలపూడి అనిత కృతజ్ఞతలు తెలిపారు. ‘అన్నా , మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ మాటలు నాకు చాలా ప్రోత్సాహాన్నిస్తున్నాయి. మీరు చెప్పినట్టే, కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి వెంటనే చర్యలు చేపట్టాం. సంక్షోభాల సమయంలో మన ప్రియతమ నాయకుడు సీఎం చంద్రబాబు చూపిన నాయకత్వం మాకు ప్రేరణగా నిలిచింది. బాధిత కుటుంబాలకు అండగా ఉండటంలో, భక్తుల్లో ధైర్యాన్ని నూరిపోసే విషయంలో ఉన్నతాధికారులు, సిబ్బంది అద్భుతమైన సమన్వయంతో పనిచేశారు. వారికి నా అభినందనలు’ అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
కాగా, అంతకు ముందు పవన్ మంత్రి అనిత సేవలను ప్రశంసిస్తూ ట్విట్ చేశారు..
విపత్కర పరిస్థితుల్లో వంగలపూడి అనిత బాధ్యతలు నిర్వహణ అభినందనీయం . రాష్ట్ర హోమ్, విపత్తు నిర్వహణల శాఖ మంత్రి అనిత విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పుడు బాధ్యతల నిర్వహణలో చూపుతున్న చొరవ, బాధితులకు బాసటగా నిలుస్తున్న తీరు అభినందనీయం. ప్రజా జీవితంలో ఉన్నవారు ఏ సమయంలోనైనా స్పందించడమే కాదు, శోకంలో ఉన్నవారికి సాంత్వన చేకూర్చాలి. అనిత ఆ విధంగానే స్పందిస్తున్నారు. సింహాచలం దుర్ఘటన విషయం తెలియగానే తెల్లవారుజామున 3 గం.కే ఘటన ప్రదేశానికి చేరుకొని పరిస్థితులు సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మృతులు, క్షతగాత్రుల సంబంధీకులతో మాట్లాడి ఓదార్చారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి గారి కుటుంబానికి అనిత గారు వెన్నంటి ఉండి మనో ధైర్యం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, బాధితులకు ఎలా భరోసా ఇస్తుందో చెప్పడానికి అనిత బాధ్యతల నిర్వహణ ఒక తార్కాణం. అంటూ ట్విట్ చేశారు.