Godavari Delta | గోదావరి డెల్టాకు మహర్దశ.. ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం

Godavari Delta | గోదావరి డెల్టాకు మహర్దశ.. ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం

లైడార్ సర్వేతో డెల్టా ఆధునీకరణకు డీపీఆర్‌లు సిద్ధం

ధవళేశ్వరం బ్యారేజీకి 117 కొత్త గేట్లు, హెడ్ స్లూయిస్‌ల మరమ్మతులు

ఈనెల 13న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పనుల ప్రారంభం

Godavari Delta | అమరావతి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: గోదావరి డెల్టాకు మహర్దశ పట్టనుంది. పురాతన కాలం నాటి కాల్వల వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు, సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు ఏర్పాటు చేసి, మరమ్మతులు చేపట్టడంపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ ఖరీఫ్ సీజన్‌లోనే పోలవరం ఎడమ కాలువకు నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లైడార్ సర్వే ద్వారా కాలువల మరమ్మతుల అవసరాన్ని గుర్తించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు) సిద్ధం చేస్తున్నారు. సర్వే ఆధారంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజిటల్ డేటా రూపొందిస్తుండటంతో సాగునీటి నిర్వహణ, వరద నియంత్రణ మరింత సమర్థంగా సాగుతాయని అధికారులు చెబుతున్నారు.

దేశంలోనే తొలిసారిగా ఇరిగేషన్ క్యాలెండర్ ఆవిష్కరించిన కూటమి ప్రభుత్వం, గోదావరి డెల్టా రైతాంగం, ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఏరియల్ లైడార్ సర్వే, జియో రిఫరెన్స్ మ్యాపుల ఆధారంగా డీపీఆర్‌ల తయారీ కోసం ఇప్పటికే రూ.13.5 కోట్ల నిధులు విడుదల చేసింది.

గడువు ముగిసిన ధవళేశ్వరం బ్యారేజీని పునర్నిర్మించడంతో పాటు, భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జలవనరుల నిపుణుల సిఫార్సులు, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు శాశ్వత ప్రాతిపదికన ఆధునీకరణ పనులు చేపడుతోంది. గత ప్రభుత్వ హయాంలో కనీస మరమ్మతులు కూడా చేపట్టకపోవడంతో, బ్యారేజీతో పాటు కాలువల వ్యవస్థ కూడా అధ్వాన్నంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు.

సాగుకు అవరోధాలు లేకుండా, గోదావరి డెల్టా కాలువల్లో నిరంతర నీటి సరఫరా కొనసాగించేందుకు స్టాప్‌లాగ్ గేట్లను వినియోగిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 10,13,161 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు అందుతోంది. రాష్ట్ర ఆహార భద్రతకు కీలకమైన గోదావరి డెల్టాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా గోదావరి డెల్టా కాలువల విస్తరణ, ఆధునీకరణ పూర్తి చేయాలనే సంకల్పంతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణం జరిగి 50 సంవత్సరాలు పూర్తవడంతో కొత్త గేట్లు, హెడ్ స్లూయిస్ గేట్లు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో ఈనెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్నాయి. అదే రోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించి, రాష్ట్రంలోని జలవనరుల ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు.

ధవళేశ్వరం బ్యారేజీలో మొత్తం 175 క్రస్ట్ గేట్లు, 10 స్కౌర్ స్లూయిస్ గేట్లు, 12 హెడ్ స్లూయిస్ గేట్లు ఉన్నాయి. గతంలో 175 గేట్లలో కేవలం 58 గేట్లకే మరమ్మతులు జరిగాయి. ఇప్పుడు మిగిలిన 117 గేట్లతో పాటు 12 హెడ్ స్లూయిస్ గేట్లకు పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టనున్నారు.

బ్యారేజీ నాలుగు ఆర్మ్‌లలోని మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ పనులకు ప్రభుత్వం ఇప్పటికే రూ.10.09 కోట్లు మంజూరు చేసింది. కొత్తగా 129 గేట్లు, రబ్బర్ సీల్స్, శాండ్ బ్లాస్టింగ్, పెయింటింగ్, 734 రోలర్ బేరింగ్లు, వైర్ రోపులు, మోటార్లు పూర్తిగా మార్చనున్నారు. అలాగే కొత్త స్టాప్‌లాగ్ గేట్లు, ఎలక్ట్రికల్ కేబులింగ్, వైరింగ్, కంట్రోల్ ప్యానెల్స్, 102 మాస్టర్ కంట్రోలర్ ప్యానెల్స్, 250 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు, 75 కేవీఏ జనరేటర్లు, కొత్త బ్యాటరీలతో ఆధునీకరణ పనులు చేపడుతున్నారు.

ఈ ఏడాది జనవరి నుంచి టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. మే 8న హైదరాబాద్‌కు చెందిన బేకమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ ఈ పనులను దక్కించుకుంది. రెండేళ్లలో పూర్తి స్థాయిలో ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పూర్తి చేసేలా జలవనరుల శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది.