ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించిన సర్పంచ్ మౌనిక

తొర్రూరు, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని భోజ్య తండా సర్పంచ్ మాలోత్ మౌనిక సంతోష్ కుమార్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం భోజ్య తండా గ్రామానికి చెందిన సర్పంచ్ దంపతులు తమ ఇద్దరు కుమారులు మాలోత్ గౌతమ్ నాయక్, మాలోత్ సుశాంత్‌లను గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం చేర్పించి ప్రభుత్వ విద్యపై తమ విశ్వాసాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వం కల్పిస్తున్న నాణ్యమైన విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.