NZB | బ్లాక్‌మెయిల్ ముఠా బట్టబయలు…
- యువతను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్
- ఫోటోలు తీసి బెదిరింపులు.. యువకుడు అరెస్ట్
- సోషల్ మీడియా పేరుతో బ్లాక్‌మెయిల్
- బెదిరించి నగదు వసూలు.. నిందితుడికి రిమాండ్
NZB | భీంగల్ టౌన్ / రూరల్, ఆంధ్రప్రభ : భీంగల్ మండలంలోని లింబాద్రి గుట్ట ప్రాంతానికి వచ్చే యువతీ యువకులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని భీంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. భీంగల్ మండలం లింగాపూర్ చౌత్ గ్రామానికి చెందిన గంధం భాస్కర్ (32) సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తరచూ లింబాద్రి గుట్ట వెనుక ప్రాంతానికి వెళ్లేవాడు. అక్కడకు వచ్చే యువతీ యువకుల ఫోటోలు, వీడియోలను వారి అనుమతి లేకుండా తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించేవాడు.
అనంతరం వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, వివిధ కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తూ నగదు డిమాండ్ చేసేవాడని దర్యాప్తులో వెల్లడైంది. ఈ నెల జూన్ 29న ఫిర్యాదుదారుడు, అతని స్నేహితులను కూడా ఇదే విధంగా బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు. భయంతో వారు తమ వద్ద ఉన్న రూ.10 వేల నగదును నిందితుడికి ఇచ్చారు. అయినప్పటికీ మరింత డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో బాధితులు ధైర్యం చేసి భీంగల్ పోలీసులను ఆశ్రయించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి, సాంకేతిక ఆధారాలు మరియు బాధితుల వాంగ్మూలాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్‌కు పంపింది. పోలీసులు నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అందులో ఉన్న ఫోటోలు, వీడియోలు, ఇతర డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇదే తరహాలో మరికొందరిని కూడా బెదిరించి డబ్బులు వసూలు చేశాడా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. భీంగల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మాట్లాడుతూ, ఫోటోలు లేదా వీడియోలు తీసి బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దని, వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్–100కు సమాచారం అందించాలని సూచించారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
