వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేసి, నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని భీమ్‌గల్ మండల ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని బాబానగర్, బాబాపూర్ గ్రామాల నర్సరీలను ఆయన పరిశీలించి మొక్కల నిర్వహణ, ప్లాంటేషన్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా నర్సరీల్లో ఉన్న మొక్కలను గ్రేడింగ్ చేసి అవసరమైన మేరకు షిఫ్టింగ్ పూర్తి చేసి, నాటేందుకు సిద్ధంగా ఉంచాలని పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామాల్లో గుంతల తవ్వకం వేగవంతం చేసి, మొక్కల నాటే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. రాబోయే పది రోజుల్లో మండలానికి కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని పేర్కొంటూ ట్రీ గార్డులు ఏర్పాటు చేయడం, క్రమం తప్పకుండా నీరు అందించడం, పశువుల నుంచి రక్షణ కల్పించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, రహదారుల వెంట, ఖాళీ ప్రభుత్వ స్థలాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు సంతోష్, రమ్య, ఫీల్డ్ అసిస్టెంట్లు, కారోబార్లు, సిబ్బంది శివ తదితరులు పాల్గొన్నారు.
