పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి: తెలంగాణ రైతు సంఘం
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: పెంచిన ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని తెలంగాణ రైతు సంఘం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్కూరి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పంటల బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు. పెరిగిన ధరలతో రైతులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని, ఈ పరిస్థితి రైతులను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్‌ను వెంటనే చెల్లించాలని, నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడే వారిపై వ్యవసాయ శాఖ అధికారులు పీడీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గొట్టేముక్కల మనోహర్‌రావు, మండల రైతు సంఘం ఉపాధ్యక్షులు ఇంజాల పోచయ్య, పిన్‌రెడ్డి మోహన్‌రెడ్డి, బోయినపల్లి స్వామిరావు తదితరులు పాల్గొన్నారు.
