125-days : ఉపాధికి కొత్త చిగురు Andhra Prabha Spl Story
125-days : ఉపాధికి కొత్త చిగురు Andhra Prabha Spl Story
- ‘వీబీ-గ్రామ్ జీ’ దిక్సూచి.
- 100 రోజుల నుంచి 125 రోజుల దిశగా..
- లక్ష్యాలను దాటిన కర్నూలు..
( కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ).
గ్రామీణ కుటుంబాలకు కేవలం ఉపాధి కల్పించడమే కాదు.. వారి జీవనోపాధిని బలోపేతం చేయడం, గ్రామీణ మౌలిక వసతుల కల్పన, సాంకేతికతతో పారదర్శకత పెంపు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామా పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) స్థానంలో ‘వికసిత్ భారత్–రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) – వీబీ-గ్రామ్ జీ’ అమలుకు శ్రీకారం చుట్టింది. జూలై 1 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం గ్రామీణాభివృద్ధికి కొత్త దిశగా మారనుండగా.. ఇప్పటికే ఉపాధి హామా అమలులో రాష్ట్రంలోనే ముందంజలో ఉన్న కర్నూలు జిల్లా ఈ కొత్త విధానానికి మరింత బలం చేకూర్చేలా అడుగులు వేస్తోంది.
125-days : ఉపాధికి కొత్త చిగురు

గ్రామీణ పేద కుటుంబాలకు ఉపాధి హామీని మరింత విస్తరించడంతో పాటు జీవనోపాధిని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్–రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) (వీబీ గ్రామ్ జి) కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. గతంలో అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామా పథకానికి ఆధునిక రూపంగా తీసుకొచ్చిన ఈ కార్యక్రమం జూలై 1 నుంచి 125 రోజుల ప్రత్యేక కార్యాచరణతో ప్రారంభమైంది. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ, ఉపాధి దినాల పెంపు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలకు ఇందులో ప్రాధాన్యం కల్పించారు.
ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి కనీసం 125 రోజుల ఉపాధి కల్పించడం ఈ పథకంలోని ప్రధాన లక్ష్యం. అవసరాన్ని బట్టి దీనిని 150 రోజుల వరకు పొడిగించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. గతంలో శ్రామిక పనులకే పరిమితమైన ఉపాధి హామా ఇప్పుడు గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని పెంచే జీవనోపాధి పనులు, శాశ్వత ఆస్తుల సృష్టి, స్థానిక అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించనుంది.
125-days : టెక్నాలజీతో పారదర్శకత
పథకం అమలులో పారదర్శకత పెంచేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. మొబైల్ ఆధారిత జియో-ట్యాగింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యవేక్షణ, ఈ-కేవైసీ విధానాన్ని తప్పనిసరి చేయడం ద్వారా నకిలీ నమోదు, అక్రమాలకు అడ్డుకట్ట వేయనున్నారు. నెట్‌వర్క్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో కూడా పనులకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
125-days : 15 రోజుల్లో పని లేకపోతే భృతి

కొత్త మార్గదర్శకాల ప్రకారం పని కోరిన కుటుంబానికి 15 రోజుల్లోపు ఉపాధి కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి చెల్లించే నిబంధన కొనసాగనుంది. అలాగే వ్యవసాయ పనులు లేని కాలంలో రైతు, కూలీ కుటుంబాలకు అదనపు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
ల125-days : క్ష్యాలను అధిగమించిన కర్నూలు
కొత్త విధానం అమలుకు ముందే కర్నూలు జిల్లా ఉపాధి హామా అమలులో విశేష పురోగతి సాధించింది. జిల్లాలోని 25 మండలాలు, 484 గ్రామ పంచాయతీల్లో పనులు కొనసాగుతున్నాయి. మొత్తం 3.15 లక్షల జాబ్ కార్డులు, 5.95 లక్షల మంది కార్మికులు నమోదు కాగా, ప్రస్తుతం 2.59 లక్షల క్రియాశీల జాబ్ కార్డులు, 4.61 లక్షల క్రియాశీల కార్మికులు ఉన్నారు.
2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1.33 లక్షల కుటుంబాలకు ఉపాధి లభించగా, 3.20 లక్షల మంది కార్మికులు పనుల్లో పాల్గొన్నారు. ఒక్కో కుటుంబానికి సగటున 35 రోజుల ఉపాధి లభించింది.
125-days : పని దినాల్లో శతశాతం లక్ష్య సాధన

జిల్లాకు నిర్దేశించిన 64.59 లక్షల మానవ దినాల లక్ష్యాన్ని అధిగమించి 64.88 లక్షల మానవ దినాలు సృష్టించడం విశేషం. ఇది లక్ష్య సాధనలో జిల్లాకు ఉన్న సమర్థతను చాటుతోంది. ప్రస్తుతం రోజువారీ సగటు వేతనం రూ.271గా నమోదైంది. అలాగే 3,705 కుటుంబాలు ఇప్పటికే 100 రోజుల ఉపాధిని పూర్తి చేశాయి.
125-days : రూ.249 కోట్లకుపైగా వ్యయం
పథకం అమలులో భాగంగా వేతనాల కింద రూ.104.95 కోట్లు, మెటీరియల్ భాగంలో రూ.13.10 కోట్లు వెచ్చించారు. 2026-27లో మొత్తం వ్యయం రూ.249.47 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే పనుల అమలు మరింత వేగవంతంగా కొనసాగుతున్నట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి.
125-days : వ్యక్తిగత ఆస్తుల సృష్టిలో పురోగతి
గ్రామీణ కుటుంబాల ఆదాయ వనరులను పెంచే లక్ష్యంతో ఉద్యానవనాలు, పశువుల షెడ్లు, కంపోస్ట్ గుంతలు, సోక్‌పిట్లు, మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణంలోనూ జిల్లా గణనీయమైన పురోగతి సాధించింది. 4,500 ఎకరాల ఉద్యానవనాల లక్ష్యానికి 4,123 ఎకరాలు, 1,400 పశువుల షెడ్ల లక్ష్యానికి 561, 17,167 కంపోస్ట్ గుంతల లక్ష్యానికి 14,889, 2,420 సోక్‌పిట్ల లక్ష్యానికి 2,035, 1,442 మ్యాజిక్ డ్రెయిన్ల లక్ష్యానికి 1,230 పనులు పూర్తయ్యాయి. మిగిలిన లక్ష్యాలను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
గ్రా125-days : మీణాభివృద్ధికి కొత్త అధ్యాయం
ఉపాధి హామా పథకాన్ని కేవలం కూలి పనులకు పరిమితం చేయకుండా, గ్రామీణ కుటుంబాల ఆదాయం, నైపుణ్యాభివృద్ధి, శాశ్వత ఆస్తుల కల్పన, డిజిటల్ పారదర్శకత వంటి అంశాలను సమన్వయం చేస్తూ రూపొందించిన ‘వీబీ-గ్రామ్ జీ’ గ్రామీణాభివృద్ధిలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. ఇప్పటికే లక్ష్యాలను అధిగమిస్తున్న కర్నూలు జిల్లా ఈ కొత్త విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే గ్రామీణ కుటుంబాల ఆర్థిక స్థితిగతుల్లో మరింత గుణాత్మక మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
