గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం
కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ: కర్నూలు సమ్మర్ స్టోరేజ్ సమీపంలోని మునగాలపాడు గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో మునగాలపాడు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 86 వద్ద ఓ పురుషుడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మృతుడు ఆకుపచ్చ రంగు టీ-షర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు మృతుడి గుర్తింపు తెలియరాలేదని వెల్లడించారు.
ఈ వివరాలకు సరిపడే వ్యక్తి ఎవరైనా కనిపించకుండా పోయినా, మృతుడి గురించి ఏవైనా సమాచారం తెలిసిన వారు వెంటనే కర్నూలు తాలూకా అర్బన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సీఐ తేజమూర్తి విజ్ఞప్తి చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
