నందికొట్కూరులో ఆర్డీ మెరుపు తనిఖీ..

నందికొట్కూరులో ఆర్డీ మెరుపు తనిఖీ..
పారిశుధ్య లోపాలపై అధికారులకు గట్టి హెచ్చరిక
డ్రైనేజీ సమస్యలు తలెత్తితే కఠిన చర్యలు తప్పవన్న ఆర్డీ నాగరాజు
నందికొట్కూరు, మే 23 (ఆంధ్రప్రభ): నందికొట్కూరు మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణపై రీజినల్ డైరెక్టర్ నాగరాజు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డితో కలిసి పట్టణంలోని కంపోస్ట్ యార్డును పరిశీలించిన ఆయన, అక్కడ పలు లోపాలను గుర్తించి అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం అల్లూరు రోడ్డులో కొనసాగుతున్న డ్రైనేజీ క్లీనింగ్ పనులను స్వయంగా పరిశీలించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో ఎక్కడా డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగితే సహించబోమని స్పష్టం చేస్తూ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

ఆకస్మికంగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఆర్డీ నాగరాజు టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాల పనితీరును సమీక్షించారు. ఫైళ్ల నిర్వహణ, అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. డ్రైనేజీ, పారిశుధ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు.
కంపోస్ట్ యార్డులో చెత్త కుప్పలు, నిర్వహణ లోపాలను గమనించిన ఆర్డీ అధికారులకు తీవ్రంగా మందలించారు. ప్రతి విభాగం బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఆర్డీ ఆకస్మిక తనిఖీతో మున్సిపల్ సిబ్బందిలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.
