నిరుపేదలకు అండగా సీఎంఆర్ఎఫ్ పథకం

  • రూ 22.36 లక్షల చెక్కుల పంపిణీ
  • 77 మంది బాధితులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

చిట్యాల, ఆంధ్రప్రభ: అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) పథకం ఎంతో అండగా నిలుస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిట్యాల మండలానికి 26, మొగుళ్లపల్లి మండలానికి 30, టేకుమట్ల మండలానికి 21 చొప్పున మొత్తం 77 మంది లబ్ధిదారులకు రూ.22,36,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినట్లు తెలిపారు.

పేదలకు అత్యవసర వైద్య చికిత్స సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్‌ఓసీల ద్వారా నిరంతరం సహాయం అందిస్తున్నామని చెప్పారు. వైద్య సహాయం అవసరమైన ప్రతి నిరుపేద కుటుంబం ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎంఆర్ఐ, సీటీ స్కాన్ వంటి ఆధునిక వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చామని, పరిశుభ్రతతో పాటు సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్‌పర్సన్ గుమ్మడి శ్రీదేవి, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూట్ల తిరుపతి, కోటగిరి సతీష్, ఆకుతోట కుమారస్వామి, జిల్లా, మండల నాయకులు పులి తిరుపతిరెడ్డి, కామిడి రత్నాకర్ రెడ్డి, దొడ్డి కిష్టయ్య, గడ్డం కొమరయ్య, గంగాధరి రవీందర్, గుర్రపు తిరుపతి, అల్లం రాజు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.