Raja Singh | 2022 కేసులో నిర్దోషిగా…

Raja Singh | 2022 కేసులో నిర్దోషిగా…

Raja Singh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్‌పై 2022లో నమోదైన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో హైదరాబాద్ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇరుపక్షాల వాదనలు, సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం ఆయనపై నమోదైన కేసును కొట్టివేసింది.

కోర్టు తన తీర్పులో రాజాసింగ్‌పై మోపిన ఆరోపణలను నిరూపించేంత బలమైన ఆధారాలు లేవని పేర్కొంటూ ఆయనను నిర్దోషిగా ప్రకటించింది.

2022 ఆగస్టులో హైదరాబాద్‌లో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ టీ రాజాసింగ్ యూట్యూబ్‌లో విడుదల చేసిన వీడియో వివాదానికి దారితీసింది. ఆ వీడియో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందంటూ పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. అనంతరం మంగళ్‌హాట్ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 153ఏ, 295ఏ, 504, 505(2), 506 కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసులో 2022 ఆగస్టు 23న రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే అరెస్టు ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని పేర్కొంటూ స్థానిక కోర్టు రిమాండ్‌ను తిరస్కరించి ఆయనను విడుదల చేసింది. అనంతరం నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో శాంతిభద్రతల దృష్ట్యా ఆయనపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేయగా, దాదాపు 77 రోజుల పాటు జైలులో ఉన్నారు.
తాజాగా ప్రత్యేక కోర్టు కేసును కొట్టివేయడంతో ఈ వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.