ఏపీఎల్‌ను ఐపీఎల్ స్థాయికి తీసుకెళ్తాం
వచ్చే ఏడాది ఆరు వేదికల్లో మ్యాచ్‌లు..
తర్వాత ఏడు స్టేడియాల్లో నిర్వహణ లక్ష్యం
మూడు స్టేడియాలను ఆధునికీకరించాం..
క్రికెట్‌ను గ్రామీణ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం
ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేసినేని శివనాథ్ (చిన్ని)
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధే లక్ష్యంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)ను ఐపీఎల్ తరహాలో మరింత విస్తరిస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. ప్రస్తుతం మూడు వేదికల్లో విజయవంతంగా నిర్వహించిన ఏపీఎల్‌ను వచ్చే ఏడాది ఆరు స్టేడియాలకు, అనంతరం ఏడు వేదికలకు విస్తరించే ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు. ఏపీఎల్ ఫైనల్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, ఏడాదిన్నర క్రితం ఏసీఏ బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తిగా క్రికెట్ అభివృద్ధిపైనే దృష్టి పెట్టామని చెప్పారు. ముందుగా విశాఖపట్నం అంతర్జాతీయ స్టేడియాన్ని ఆధునికీకరించి బీసీసీఐ ప్రశంసలు అందుకున్నామని, అనంతరం కడప, మంగళగిరి స్టేడియాలను కూడా అత్యాధునికంగా తీర్చిదిద్దామని వివరించారు. మూడు ప్రాంతాల్లో జరిగిన ఏపీఎల్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. విశాఖలో మంచి ఆదరణ లభిస్తే, కడపలో అది మరింత పెరిగిందని, మంగళగిరిలో అత్యధిక స్పందన కనిపించిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాస్‌లు ఇచ్చి యువతలో క్రికెట్‌పై ఆసక్తి పెంచామని చెప్పారు.
విజయవంతంగా ఏపిఎల్…
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆర్థికంగా ఇతర పెద్ద రాష్ట్రాల క్రికెట్ సంఘాల కంటే బలహీనమైనప్పటికీ, మూడు వేదికల్లో లీగ్‌ను విజయవంతంగా నిర్వహించడం విశేషమని ఏసీ అధ్యక్షుడు కేశినేని శివనాద్ తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీల మద్దతు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో స్వంత వనరులతోనే ఈ స్థాయిలో లీగ్ నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఏపీఎల్ ద్వారా యువ క్రికెటర్లకు ఆర్థిక అవకాశాలు కూడా కల్పించామని తెలిపారు. ఒక టీ దుకాణం నిర్వహించే కుటుంబానికి చెందిన యువ ఆటగాడు వేలంలో రూ.8 లక్షలకు ఎంపిక కావడం ఈ లీగ్ విజయానికి నిదర్శనమన్నారు. భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయిలో ప్రైజ్ మనీ, ఆటగాళ్ల పారితోషికం పెంచేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
బెట్టింగ్ కి అవకాశం లేదు..
బెట్టింగ్ వంటి అక్రమాలకు ఎలాంటి అవకాశం లేకుండా బీసీసీఐ విజిలెన్స్ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాయని ఎంపీ కేసినేని శివనాథ్ స్పష్టం చేశారు. స్టేడియాల్లో కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థ అమలులో ఉందని తెలిపారు. వచ్చే ఏడాది తిరుపతి, మూలపాడు, కాకినాడ స్టేడియాలను ఏపీఎల్ వేదికలుగా చేర్చనున్నట్లు వెల్లడించారు. అలాగే అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో మరో క్రికెట్ స్టేడియం నిర్మాణం కూడా కొనసాగుతోందని చెప్పారు. బీసీసీఐలో పదవిపై వస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేసిన కేసినేని శివనాథ్, ప్రస్తుతం తన పూర్తి దృష్టి ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధిపైనే ఉందన్నారు. ముందుగా రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు..ఏపీఎల్ ఫైనల్‌కు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు.
