Krishna River Water Dispute | ఆర్ఎంసీ సమావేశంపై ఇరు రాష్ట్రాల దృష్టి
Krishna River Water Dispute | ఆర్ఎంసీ సమావేశంపై ఇరు రాష్ట్రాల దృష్టి
Krishna River Water Dispute | కృష్ణా జలాల పంపిణీపై ఏపీ-తెలంగాణ మరోసారి ముఖాముఖి
66:34 వర్సెస్ 50:50.. నీటి వాటాలపై తీవ్ర వాదనలు
Krishna River Water Dispute | అమరావతి, ఆంధ్రప్రభ : కృష్ణా నదిలో ఏటా వరదలతో పాటు వివాదాలు కూడా పారుతుంటాయి. ఈ వివాదాలు ప్రతి సంవత్సరం వర్షాలు ప్రారంభమయ్యే జూన్ చివరి నుంచి మొదలై జులైలో ముమ్మరమై ఖరీఫ్, రబీ సీజన్ ముగిసేదాకా సాగుతుంటాయి. కృష్ణాలో ప్రధాన ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ఏ రాష్ట్రం ఎంత నీటిని వాడుకోవాలనే వివాదాల చిక్కుముడి రాష్ట్రం విడిపోయిన 12 ఏళ్లుగా సాగుతూనే ఉంది.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) మధ్యవర్తిగా వ్యవహరిస్తూ తెలుగు రాష్ట్రాల సాగునీటి ప్రయోజనాల పరిరక్షణ కోసం తన వంతు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటైన రివర్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) సమావేశాన్ని జులై రెండో వారంలో నిర్వహించాలని కృష్ణా బోర్డు నిర్ణయించినట్టు సమాచారం. ఈ సమావేశంలో కృష్ణా జలాల పంపిణీ, నిర్వహణతో పాటు వాటి అనుబంధ విషయాలపై విధివిధానాలను ఖరారు చేయనున్నట్టు తెలిసింది. ఆర్ఎంసీ సమావేశంలో రెండు రాష్ట్రాలు కృష్ణా జలాల్లో తమ హక్కులు, వాటాలపై వాదనను బలంగా వినిపించనున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం గడచిన మూడేళ్లుగా ఏటా తెరమీదకు తీసుకొస్తున్న 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ వాదనను ఏపీ జలవనరుల శాఖ అంగీకరించడం లేదు. బచావత్ ట్రైబ్యునల్ నీటి పంపిణీలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదు. రాష్ట్ర పునర్విభజన సందర్భంగా బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులకు అనుగుణంగా కేంద్ర జలశక్తి సమక్షంలో 2015 జూన్ 19న రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన రాతపూర్వక ఒప్పందాలను అనుసరించి 66:34 నిష్పత్తి నీటి పంపిణీకి కట్టుబడి ఉండాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కృష్ణాలో 811 టీఎంసీల నీటి లభ్యతను లెక్కకట్టి ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను కేటాయించారు. ఈ అధికారిక ఒప్పందంపై రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులు సంతకాలు కూడా చేశారు.
ఏటా నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ జగడం
రెండు రాష్ట్రాల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల ఆధారంగా ఎంతో హేతుబద్ధంగా బచావత్ ట్రైబ్యునల్ కృష్ణాలో కేటాయింపులు చేసింది. ఈ నేపథ్యంలో ట్రైబ్యునల్‌కు విరుద్ధంగా 50:50 వాటాను డిమాండ్ చేయటంలో అర్థం లేదని ఏపీలో జలవనరుల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కృష్ణా జలాల పునఃపంపిణీపై విచారణ చేపట్టిన బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ (కేడబ్ల్యూడీటీ-2) రెండు రాష్ట్రాల వాదనను వినే దశలోనే ఉంది. ట్రైబ్యునల్ మార్గదర్శకాలు ఇప్పట్లో జారీ అయ్యే అవకాశం లేనందున బచావత్ అవార్డును అనుసరించే కృష్ణాలో రెండు రాష్ట్రాల నీటి వాటాలను ఖరారు చేయాల్సి ఉంది.
ట్రైబ్యునల్ ఆదేశం.. సుప్రీం డిక్రీతో సమానం
బచావత్ ట్రైబ్యునల్ ఆదేశాలు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం. మరే ఇతర వ్యవస్థ ట్రైబ్యునల్ ఆదేశాలను తిరగదోడటం చట్టరీత్యా సాధ్యం కాదుని ఏపీ వాదిస్తోంది. బచావత్ ట్రైబ్యునల్‌ను అనుసరించి కృష్ణాలో ఆవిరి నష్టాలు పోను నిర్ధారించిన జలాలను రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు కేటాయిస్తోంది. చట్ట ప్రకారం బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ కేవలం బచావత్ పంపిణీ చేసిన 811 టీఎంసీలకు అదనంగా కొత్తగా నీటి లభ్యతను గుర్తిస్తే ఆ జలాలను పంపిణీ చేయటానికి మాత్రమే పరిమితమవుతుందన్న సంగతి తెలంగాణకు తెలిసినా.. ఇతర ప్రయోజనాల కోసం వివాదాన్ని రగిలిస్తోందని అధికారులు చెబుతున్నారు. కృష్ణాలో 65 శాతం నీటి లభ్యత ఆధారంగా అదనంగా అందుబాటులోకి వచ్చే 163 టీఎంసీలు, వరదల సమయంలో ఒనగూరే 285 టీఎంసీల మిగులు జలాలు.. మొత్తం 448 టీఎంసీలను ఏపీ, తెలంగాణ, కర్ణాటకకు పంచే విషయానికే బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇప్పటివరకు పరిమితమైంది.
విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో ఏపీలో అదనంగా నాలుగు ప్రాజెక్టులకూ, తెలంగాణలోని రెండు ప్రాజెక్టులకు కృష్ణా జలాలను కేటాయించారు. ఏపీలో తెలుగుగంగ విస్తరణకు 29, గాలేరు-నగరి ప్రాజెక్టుకు 38, హంద్రీ-నీవాకు 40, వెలిగొండకు 43.50 టీఎంసీలు.. మొత్తం 150.50 టీఎంసీలు కేటాయించారు. తెలంగాణలోని కల్వకుర్తికి 25, నెట్టెంపాడుకు 22 టీఎంసీలు.. మొత్తం 47 టీఎంసీలు కేటాయించారు. కృష్ణా జలాల పంపిణీపై రెండు రాష్ట్రాలకు అభ్యంతరాలు ఉన్నా అవన్నీ బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపుల తర్వాత అదనంగా కేటాయించిన జలాలపై తప్ప అంతకుముందు నిర్ధారణ అయిన వాటాలపై కాదని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది.
ఇదీ తెలంగాణ వాదన
నిబంధనల ప్రకారం శ్రీశైలం నుంచి 34 టీఎంసీలకు మించి ఏపీ వినియోగించుకోకుండా కట్టడి చేయాలని, పట్టిసీమ నుంచి గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు ఏపీ తరలిస్తున్నందున అందులో తమకు వాటా కావాలని తెలంగాణ అడుగుతోంది. కృష్ణా ద్వారా ఉమ్మడి రాష్ట్రాలకు పంపిణీ చేసే నీటిని 20 శాతం తాగునీటి అవసరాల కోసం కేటాయించాలని బచావత్ ట్రైబ్యునల్ చెప్పినా అమలు కావటం లేదు. ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం ఒక ఏడాదిలో కేటాయించిన జలాల్లో మిగిలిన నీటిని వచ్చే ఏడాదికి క్యారీ ఓవర్ చేయాల్సి ఉంటుంది. చెన్నై తాగునీటి సరఫరా కోసం 1976-77లో ఇచ్చిన ఒప్పందాలకు లోబడి రూల్ కర్వ్స్ ఖరారు చేయాలి. తెలంగాణకు కృష్ణాలో 70 శాతం హక్కులు ఉన్నప్పటికీ 50:50 నిష్పత్తిలో తాత్కాలిక కేటాయింపులు చేయాలి. శ్రీశైలం, నాగార్జునసాగర్ వద్ద జలవిద్యుత్ ఉత్పత్తి రూల్ కర్వ్ సవరణ చేయాలని అడుగుతున్నా బోర్డు స్పందించటం లేదని తెలంగాణ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ఎంసీ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం తీసుకువచ్చి మార్గదర్శకాలు ఖరారు చేసేందుకు కృష్ణా బోర్డు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.
