పల్స్ పోలియోకు సర్వం సిద్ధం

మరిపెడ, ఆంధ్రప్రభ: జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి తెలిపారు. కార్యక్రమం విజయవంతం కోసం శనివారం పీహెచ్‌సీలో వైద్యులు, ఆరోగ్య సిబ్బందితో సన్నాహక సమావేశం నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.

మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులతో పాటు మండలంలోని 48 గ్రామపంచాయతీల్లో మొత్తం 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న 7,200 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమం కోసం మొత్తం 34 పోలియో బూత్‌లు, ఒక మొబైల్ బూత్, బస్టాండ్‌లో ప్రత్యేక పోలియో బూత్‌ను ఏర్పాటు చేశారు. పర్యవేక్షణను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎడ్జెర్ల, తానంచెర్ల, చిల్లంచెర్ల రూట్లుగా మూడు ప్రధాన పర్యవేక్షణ మార్గాలను ఏర్పాటు చేసి సూపర్‌వైజర్లను నియమించారు.

సన్నాహక సమావేశంలో డాక్టర్ పూజిత, డాక్టర్ స్వామి, డాక్టర్ కిరణ్, పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ మంగమ్మ, హెల్త్ సూపర్‌వైజర్లు ఆచార్యులు, మాధవి, పల్లె దవాఖానా సిబ్బంది, ఏఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, 70 మంది ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

తల్లిదండ్రులకు విజ్ఞప్తి

ఐదేళ్లలోపు పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రి సమీపంలోని పోలియో బూత్‌కు వెళ్లి తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా అందరూ సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి కోరారు.