ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాల అందించాలి..

  • జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ఓటరు నమోదు ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా జూలై 3లోపు అర్హులైన ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.

శనివారం పెద్దపల్లి పట్టణంలోని 4వ వార్డు ప్రగతి నగర్‌లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు ఆన్‌లైన్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఫారాల పంపిణీ, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు ప్రతి అర్హ ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో బీఎల్‌వోలకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు పూర్తి సహకారం అందించి ఫారాల పంపిణీని వేగవంతం చేయాలని తెలిపారు.

ప్రతి ఓటరుకు రెండు ఎన్యూమరేషన్ ఫారాలు అందించాలని, ఒక ఫారాన్ని ఓటరు వివరాలతో నింపించి స్వీకరించడంతో పాటు, మరో ఫారంపై స్వీకరణ ధృవీకరణ చేసి రసీదుగా ఓటరికి తిరిగి అందజేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు.

ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ఇంటికి చేరుకొని ప్రతి అర్హ ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందేలా అధికారులు, బీఎల్‌వోలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో పెద్దపల్లి తహసీల్దార్ రాజయ్య, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.