JC Prabhakar Reddy | చంద్రబాబు, లోకేశ్ గురించి మాట్లాడితే ఊరుకోం…
వైసీపీ హయాంలో 180 కేసులు పెట్టారు
JC Prabhakar Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్ష సాధింపులు జరిగాయని ఆరోపించారు.
వైఎస్సార్సీపీ నేత అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీ రంగయ్యపై విమర్శలు చేసిన జేసీ, అప్పటి ఎస్పీ ఫకీరప్ప తనను రాజకీయ కక్షతో అరెస్ట్ చేసి జైలుకు పంపారని ఆరోపించారు. ఆ సమయంలో అమరావతి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే చర్యలు తీసుకున్నామని, తాను నిమిత్తమాత్రుడినేనని ఎస్పీ తనతో చెప్పారని పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ పాలనలో తాడిపత్రిలో టీడీపీకి చెందిన సుమారు 300 మంది నాయకులు, కార్యకర్తలపై 180 కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. అదే సమయంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న వారిపై కూడా జేసీ విమర్శలు గుప్పించారు.
తాడిపత్రి మున్సిపాలిటీలో గత ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులు చేసిందో చెప్పాలని సవాల్ విసిరిన జేసీ, తాను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత రూ.5కే తాగునీటి సరఫరా, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సోలార్ వ్యవస్థ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
పార్టీ కార్యకర్తలే తమ బలం అని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని జేసీ స్పష్టం చేశారు. కార్యకర్తలపై ఎవరైనా దాడులకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ల పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన విధంగా స్పందిస్తామన్నారు.
