గొర్రెల కాపరి కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం

ఎమ్మెల్యే కూన రవికుమార్ చేతుల మీదుగా అందజేత

పొందూరు(ఆమదాలవలస), ఆంధ్రప్రభ: ఎమ్మెల్యే కూన రవికుమార్ చొరవతో ఆముదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన గొర్రెల కాపరి సెనగల పోతయ్య కుటుంబానికి రూ. 2 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్న సెనగల పోతయ్య గొర్రెలతో కలిసి రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో జరిగిన రైలు ప్రమాదంలో పోతయ్యతో పాటు 30 గొర్రెలు మృతి చెందాయి. దీంతో కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి ని ఒప్పించి నిబంధనలు సహకరించనప్పటికీ సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందేలా కృషి చేశారు.

ఈ మేరకు మంజూరైన రూ. 2 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బుధవారం అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆపదలో ఉన్న ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే రవికుమార్ తెలిపారు.బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.