ఎల్‌నినోను తట్టుకునే ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పోస్టర్లు

నరసరావుపేట, ఆంధ్రప్రభ: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు, అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులను ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులపై చైతన్యపరిచేందుకు రూపొందించిన అవగాహన పోస్టర్లను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతిక శుక్లా బుధవారం ఆవిష్కరించారు.

కలెక్టరేట్‌లోని శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన ప్రైమరీ సెక్టార్‌ యాక్షన్‌ ప్లాన్‌ సమావేశంలో జిల్లా అధికారుల సమక్షంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ కే. అమలకుమారి రూపొందించిన పోస్టర్లను కలెక్టర్‌ ఆవిష్కరించారు.

ఎల్‌నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు నేలలో తేమను సంరక్షించడం, తక్కువ నీటితో పంటలు సాగు చేయడం, పంటల వైవిధ్యాన్ని పాటించడం, అంతర పంటలను ప్రోత్సహించడం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం వంటి అంశాలను పోస్టర్లలో పొందుపరిచారు.

రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా ఈ పోస్టర్లను రైతులకు చేరవేసి, వాతావరణ ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులను ముందస్తుగా సన్నద్ధం చేయడంతోపాటు, జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతం చేయడమే కార్యక్రమం ఉద్దేశమని అధికారులు తెలిపారు.

సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం. జగ్గారావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి వెంకటరావు, డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ కే. అమలకుమారి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.