ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల బీభత్సం
ఒక నెలలో మూడు ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం.. చండేగాం గ్రామమే టార్గెట్
జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ: వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు మరోసారి రెచ్చిపోయారు. జుక్కల్ మండలంలోని మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులో ఉన్న చండేగాం గ్రామ శివారులో వరుసగా ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని రాగి తీగలు, ఆయిల్‌ను దొంగలించుకెళ్తున్నారు. ఒక నెల వ్యవధిలోనే మూడు ట్రాన్స్‌ఫార్మర్లు దొంగతనానికి గురికావడంతో విద్యుత్ శాఖకు లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. వర్షాకాలంలో రైతులకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
చండేగాం గ్రామానికి చెందిన రైతులు భక్తపురే బాలయ్య, రేవతిల పంట పొలాల్లో ఉన్న రెండు ట్రాన్స్‌ఫార్మర్లను గతంలో దొంగలు ధ్వంసం చేసి రాగి తీగలు, ఆయిల్‌ను ఎత్తుకెళ్లారు. తాజాగా బుధవారం తెల్లవారుజామున గులా లక్ష్మణ్ పొలంలోని 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేశారు. ఇందులో రెండు ట్రాన్స్‌ఫార్మర్లను పూర్తిగా చిందరవందర చేయగా, మరో ట్రాన్స్‌ఫార్మర్ టాప్ కవర్‌ను తొలగించి చాకచక్యంగా దొంగతనానికి పాల్పడ్డారు. బాధిత రైతులు జుక్కల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గతంలోనూ జుక్కల్ మండలంలో ఎనిమిది వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురయ్యాయని రైతులు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల గస్తీ పెంచి దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
