రైతులకు నానో ఎరువుల వినియోగంపై అవగాహన
ఆధునిక వ్యవసాయ పద్ధతులతో ఎరువుల వినియోగ సామర్థ్యం పెంచుకోవాలని సూచన
దండేపల్లి, ఆంధ్రప్రభ : రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవాలని మండల వ్యవసాయ అధికారి అంజిత్ కుమార్ సూచించారు.
దండేపల్లి మండలంలోని గూడెంలో బుధవారం వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో నానో ఎరువుల వినియోగంపై రైతులకు క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులకు నానో ఎరువుల మోతాదు, నీటిలో కలిపే విధానం, పిచికారీ పద్ధతిపై ప్రత్యక్షంగా శిక్షణ ఇచ్చారు. పంట ఆకులపై ద్రావణం సమానంగా పడేలా పిచికారీ చేయాలని సూచించారు.
అధిక ఎండ, గాలులు, వర్షం సమయంలో పిచికారీ చేయవద్దని రైతులకు సూచించారు.
నానో ఎరువులు సాధారణ ఎరువులకు పూర్తిగా ప్రత్యామ్నాయం కాదని అంజిత్ కుమార్ తెలిపారు. నేల పరీక్ష, పంట అవసరాలకు అనుగుణంగా సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా నానో ఎరువులను వినియోగించాలని సూచించారు.
ఇతర మందులతో కలిపి వాడే ముందు వాటికి సంబంధించిన సూచనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇఫ్కో ప్రతినిధి అచ్యుత్, సహకార సంఘం ముఖ్య కార్యనిర్వహణ అధికారి మల్లేష్, గూడెం గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి శ్రావణ్, వెల్గనూర్ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి సాయి, వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
