ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలి
- జిల్లా ఎస్పీ బి కృష్ణారావు
- పీజీఆర్ఎస్ లో 80 ఫిర్యాదులు
నరసరావుపేట, ఆంధ్రప్రభ : స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి కృష్ణారావు పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు, మోసం తదితర సమస్యలకు సంబంధించి 80 ఫిర్యాదులు అందాయని పోలీసు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ, సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పరిపాలన జెవి సంతోష్, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
