నాడు విమర్శలు.. నేడు అదే భవనంలో నివాసం

  • భట్టిపై తాతా మధుసూదన్ ఫైర్

ఖమ్మం, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ప్రజలు ఓట్లేశారని, కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అప్పుడే తీవ్ర అసంతృప్తి మొదలైందని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం మాజీ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్, పార్టీ జిల్లా ఇంచార్జ్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ.. తన ప్రసంగంలో కాంగ్రెస్ వైఫల్యాలను, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ద్వంద్వ నీతిని తీవ్రంగా ఎండగట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో మార్పు వస్తోందని, నియోజకవర్గంలో వ్యక్తమవుతున్న ప్రజా అసంతృప్తిని బీఆర్ఎస్ వైపు తిప్పుకోవాలంటే పార్టీ యంత్రాంగం, గ్రామ స్థాయి నిర్మాణం పటిష్టంగా ఉండాలని పిలుపునిచ్చారు.

నాడు విమర్శించి.. నేడు అదే భవనంలో నివాసమా?

గతంలో కేసీఆర్ ప్రగతి భవన్ కట్టుకుంటే “బంగారు బాత్‌రూమ్‌లు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు, మేడల్లో కులికే దొర” అంటూ భట్టి విక్రమార్క తీవ్రంగా దూషించారని గుర్తు చేశారు. కానీ నేడు అదే అద్దాల మేడలో, అదే భవనంలో ఏ ముఖం పెట్టుకుని నివసిస్తున్నారని ప్రశ్నించారు. నిజంగా సిగ్గుంటే భట్టి విక్రమార్క ఆ భవన్ నుండి బయటకు రావాలని డిమాండ్ చేశారు.

కమిషన్ల ప్రభుత్వంగా కాంగ్రెస్..

నాడు కేసీఆర్ వందలాది మందిని ప్రగతి భవన్‌లో కూర్చోబెట్టి తెలంగాణ అభివృద్ధి కోసం, అనేక సంక్షేమ పథకాల కోసం చర్చలు జరిపితే, నేడు కాంగ్రెస్ హయాంలో అదే ప్రగతి భవన్ ప్రతి వర్క్‌లో, ప్రతి బిల్లులో కమిషన్లు గుంజే కేంద్రంగా, అపవిత్రంగా మారిందని ఆరోపించారు.

కసితో పనిచేసి భట్టిని ఓడించాలి..

తమిళనాడులో స్టాలిన్, బెంగాల్‌లో మమతా బెనర్జీ వంటి వారే ఓడిపోయారని, మధిరలో భట్టి విక్రమార్కను ఓడించడం అసాధ్యమేమీ కాదన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ప్రతిజ్ఞ పూని, కసితో పనిచేసి రాబోయే రోజుల్లో భట్టి విక్రమార్కను ఓడించి తీరాలని పిలుపునిచ్చారు.

ఓటు విలువను గుర్తించండి..

ఎన్నికల్లో ఒక ఓటు పోయినా చచ్చిపోయినట్లేనని, ఓటును కాపాడుకుంటేనే బతికినట్లు లెక్కని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ బూత్ స్థాయి నుండి ఓటర్లను జాగృతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు బొమ్మెర రామ్మూర్తి, బిచ్చాల తిరుమలరావు, మొండితోక లతా, శీలం కవిత, స్థానిక సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల స్థాయి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు పాల్గొన్నారు.