ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

  • ప్రభుత్వ విప్ విజయరమణ రావు

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : రానున్న వానాకాలంలో ఈదురుగాలుల పట్ల విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అంతరాయాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసన సభ్యులు చింతకుంట విజయ రమణారావు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులు, జిల్లా సహకార అధికారి, ప్రాథమిక సహకార సంఘాల కార్యదర్శులతో వానాకాలం సీజన్ పట్ల ముందస్తుగా సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ విజయరమణ రావు మాట్లాడుతూ.. వానాకాలం దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నియోజకవర్గంలో అవసరమైన కొత్త విద్యుత్ సబ్ స్టేషన్లను గుర్తించి వాటికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. పెద్దపల్లి ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా నూతనంగా నిర్మాణం చేపడుతున్న బైపాస్ రోడ్డులో అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి వాటిని అనువైన ప్రదేశాల్లోకి మార్చాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో విద్యుత్ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలని, నియోజకవర్గంలో విద్యుత్ శాఖకు సంబంధించిన అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచనలు చేశారు. వానాకాలం సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులు ముందస్తు ప్రణాళికలతో వ్యవహరించి రైతులకు అందుబాటులో ఉండాలన్నారు.

మార్కెట్లో నకిలీ విత్తనాలపై నిఘా ఉంచి రైతులు మోసపోకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా సజావుగా విత్తనాల అమ్మకాలు సాగేలా చర్యలు తీసుకోవాలని, రైతులు కేంద్రాల వద్ద ఇబ్బంది పడకుండా డిజిటల్ ఎంట్రీలు, స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఎరువుల నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డిసిఓకు విజయరమణ రావు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీమాల, విద్యుత్ శాఖ ఎస్.ఈ గంగాధర్ డిఈ రాజబ్రహ్మ చారి, ఎఈలు, ఎడిఈలు, పాక్స్ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.