కొలనుపాక సోమేశ్వరుడిని సందర్శించిన మంత్రి జూపల్లి

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక లోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ సోమేశ్వరాలయాన్ని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం మధ్యాహ్నం సందర్శించారు. ఆలయంలో సోమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు జిఎం సోమయ్య, గంగాధర్, చంద్రశేఖర్ మంత్రికి ఆలయ ఆశీర్వచనం అందజేశారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన మంత్రికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ఆలయంలోని కాలభైరవ స్వామి,పంచముఖ బ్రహ్మ, దుర్గమ్మ, కోటొక్క లింగం లకు మంత్రి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాన్ని, మ్యూజియాన్ని మంత్రి పరిశీలించారు. అధికారులను అడిగి ప్రస్తుత ఆలయ స్థితిగతులను, చేపట్టవలసిన చర్యలను గురించి తెలుసుకున్నారు. కొలనుపాకను సమగ్ర పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరచి తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు, ఆలయ ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.