వానరానికి గ్రామస్థుల ఘన వీడ్కోలు

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని ఎలేటి రామయ్యపల్లి శివారులోని తాటివనంలో ఓ వానరం (కోతి) మృతి చెందింది. అయితే మృతి చెందిన వానరం వద్దే దాని పిల్ల కోతి ఉండి, తల్లిపట్ల మమకారం చూపడం స్థానికులను కదిలించింది.
తల్లి మృతదేహాన్ని వీడకుండా పిల్ల కోతి అక్కడే ఉండటం చూసిన పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
సమాచారం అందుకున్న ఏఆర్‌పల్లి గ్రామ సర్పంచ్ కొడారి అశోక్ పంచాయతీ సిబ్బందితో కలిసి మృతి చెందిన వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. డప్పు చప్పుళ్ల మధ్య వానరానికి సమాధి చేసి గౌరవప్రదంగా వీడ్కోలు పలికారు.
సర్పంచ్ చేపట్టిన ఈ చర్యను గ్రామస్థులు అభినందించారు. జంతువుల పట్ల మానవత్వం, దయ చూపించడం ఆదర్శనీయమని పలువురు పేర్కొన్నారు.
