తెగిన బంధం
- రైతు పక్కన ఉండాల్సిన వ్యవస్థ ఎక్కడ?
- పింఛన్ పంపిణీ, ఇంటి పన్ను వసూళ్లు, సర్ పనుల్లో బిజీ బిజీ
- వ్యవసాయ క్షేత్రాల్లో కంపెనీ ఏజెంట్లు
- సలహాదారులుగా మారిన రసాయన దుఖానాలు
అర్ధవీడు, ఆంధ్రప్రభ : రైతుకు మట్టితో బంధం సహజం. వ్యవసాయ శాఖతో బంధం అవసరం. ఒకటి జీవనాధారాన్ని ఇస్తే, మరొకటి మార్గదర్శకత్వాన్ని అందించాలి. అయితే రైతు–వ్యవసాయ శాఖ మధ్య ఉండాల్సిన అనుబంధం క్రమంగా బలహీనపడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మండలంలో వేసవి పత్తి పంట కీలక దశలో ఉంది. పూత, పిందే దశలో తెల్లదోమ, పచ్చదోమ, పిండి నల్లి వంటి చీడపీడలు పంటను వెంటాడుతున్నాయి. గులాబీ రంగు పురుగు ముప్పు కూడా పొంచి ఉంది. ఇలాంటి సమయంలో రైతుకు అండగా వ్యవసాయ శాఖ నిలవాల్సి ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అధికారుల జాడ కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు.
వ్యవసాయ క్షేత్రాల్లో ప్రైవేట్ కంపెనీల ఏజెంట్లు తిరుగుతూ తమ ఉత్పత్తులను సిఫారసు చేస్తుండగా, పురుగుమందుల దుకాణాలు వ్యవసాయ సలహా కేంద్రాలుగా మారుతున్న పరిస్థితి నెలకొంది.
మండలంలో వ్యవసాయ శాఖ రెండు అంచెల్లో పనిచేస్తోంది. మండల వ్యవసాయ కార్యాలయంతో పాటు గ్రామ, పంచాయతీ స్థాయిలో రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. రైతులకు సాంకేతిక సలహాలు అందించడం, పంటలను పరిశీలించడం, సమస్యలను గుర్తించడం, నివారణ చర్యలు సూచించడం వీటి ప్రధాన బాధ్యతలు.
మండల స్థాయి అధికారులకు ఎరువులు, పురుగుమందుల దుకాణాలకు లైసెన్సులు జారీ చేయడం, పునరుద్ధరణ, పరిపాలనా కార్యక్రమాలు, పంటల పరిశీలన వంటి బాధ్యతలు ఉన్నాయి. రైతు సేవా కేంద్రాల్లో పీఎం కిసాన్ ఈ-కేవైసీ, పంట నమోదు వంటి పనులతో పాటు పంటల పర్యవేక్షణ కూడా నిర్వహించాల్సి ఉంటుంది.
అయితే ప్రస్తుతం పంటల పరిశీలన కంటే పింఛన్ల పంపిణీ, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్, యూనిఫైడ్ సర్వే, ఇంటి పన్నుల వసూళ్లు, బీఎల్ఓ విధులు తదితర వ్యవసాయేతర పనుల్లో సిబ్బంది నిమగ్నమై ఉన్నారని రైతులు చెబుతున్నారు. దీంతో రైతు పొలాల్లో సమస్యలను గుర్తించి తక్షణ సలహాలు అందించే వ్యవసాయ విస్తరణ సేవలు దాదాపు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ వ్యవస్థను కాకుండా నేరుగా వ్యవసాయ దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. పంటలో పురుగు కనిపించినా, ఆకుల రంగు మారినా, పూత రాలినా లేదా దిగుబడిపై సందేహాలు వచ్చినా ముందుగా వ్యవసాయ అధికారులను కాకుండా దుకాణదారులను సంప్రదించే పరిస్థితి ఏర్పడింది.
ఇది వ్యవసాయ దుకాణాలపై విమర్శ కాదని, ప్రభుత్వ సలహా వ్యవస్థలో ఏర్పడిన ఖాళీకి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. శాస్త్రీయ మార్గదర్శకత్వం స్థానంలో వ్యాపార ప్రయోజనాల ఆధారంగా సలహాలు ప్రాధాన్యం పొందితే రైతు నిర్ణయాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
వ్యవసాయ రంగంలో ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు ఎంత ముఖ్యమో, సరైన సమయంలో సరైన సలహా కూడా అంతే కీలకం. రైతుకు ఆ సలహా అందించే వ్యవస్థ బలహీనపడితే దాని ప్రభావం వ్యక్తిగత రైతుపైనే కాకుండా మొత్తం వ్యవసాయ రంగంపైనా పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
రైతుకు సహాయం చేయడానికి కార్యాలయాలు, సిబ్బంది, వ్యవస్థ అన్నీ ఉన్నప్పటికీ, సమస్య వచ్చినప్పుడు రైతుకు గుర్తుకు వచ్చేది ప్రభుత్వ వ్యవస్థ కాకుండా ఒక దుకాణం మాత్రమే అయితే అది సేవల లోపానికి సంకేతమని రైతులు పేర్కొంటున్నారు.
పురుగుల కంటే ప్రమాదకరమైనది సలహాల కొరత. ఎరువుల కంటే విలువైనది నమ్మకం. రైతు–వ్యవసాయ శాఖ మధ్య ఆ నమ్మకపు వంతెన బలహీనపడితే దాని మూల్యం చెల్లించేది చివరకు రైతేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
