Incident | మంట కలిసిన మానవత్వం…..!
Incident | మంట కలిసిన మానవత్వం…..!
పల్నాడులో ఘోరం…!
దర్యాప్తు చేస్తున్న బండ్లమోటు పోలీసులు…!
Incident | పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : నేటి సమాజంలో మానవత్వం మంట కలిసిపోతుంది…. కోప-తాపాలు- ఆవేశాలు చంపుకునే స్థాయికి చేరుతున్నాయంటే ఆశ్చర్యం కాదు… పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లి-దండ్రులకు…. ఆ పిల్లలే కసాయివారీగా మారి వారిని హత మారుస్తున్న దారుణమైన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకోవటం ఆశ్చర్యంగా ఉంది. ఏడాది క్రితం తల్లిని… నేడు తండ్రిని మతిస్థిమితం లేని కొడుకు చంపిన సంఘటన పల్నాడు జిల్లా, బొల్లాపల్లి మండలం, వెల్లటూరు గ్రామంలో చోటు చేసుకుంది.
బండ్ల మోటు పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… గ్రామానికి చెందిన గజ్జ చిన్న నరసయ్య (80), సోమమ్మ లకు ముగ్గురు కుమారులు, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ఇద్దరు కుమారులకు ఇద్దరు కూతుళ్లకు వివాహమైంది. అయితే మూడో కుమారుడు అయిన బాదరయ్యకు పెళ్లి కాకపోవడంతో తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నాడు. గత ఏడాది ఏప్రిల్ నెలలో పనికి పోవడం లేదని తల్లి సోమమ్మ మందలించింది. దీంతో బాధరయ్య ఆగ్రహంతో రోకలిబండతో తల్లి పై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే మరణించింది.
ఈ కేసులో తను జైలు జీవితాన్ని కూడా గడిపినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంట్లో తండ్రి, కుమారుడు మాత్రమే ఉంటున్నారు. క్రాప్ చేయించుకోవాలి డబ్బులు ఇవ్వమని తండ్రిని అడగడం…, ఆయన ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య మాట, మాట పెరిగి గొడవ జరిగింది. దీంతో బాధరయ్య సమీపంలో ఉన్న కర్రతో తండ్రి తలపై బలంగా కొట్టాడు. ఈ ఘటనలో చిన్న నరసయ్య అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై బండ్లమోటు ఎస్సై సమీర్ భాష తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం చిన్న నరసయ్య మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి, పోస్టుమార్టం నిర్వహించారు.
చిన్న నరసయ్య పెద్ద కుమారుడైన శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండ్లమోటు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసును వినుకొండ రూరల్ సీఐ బి. బ్రహ్మయ్య దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మూడు సంవత్సరాల క్రితం ప్రమాదంలో బాధరయ్య మతిస్థిమితం కోల్పోయారని స్థానికులు పేర్కొంటున్నారు. తల్లిని చంపిన కేసు పూర్తి కాకుండానే… తండ్రిని చంపిన కేసులో బాదరయ్య జైలుకు వెళ్ళనున్నారని చెప్పకనే తెలుస్తుంది.
