ప్లాస్టిక్ వినియోగం మానేస్తేనే ఆరోగ్యానికి భరోసా..
ప్లాస్టిక్ వినియోగం మానేస్తేనే ఆరోగ్యానికి భరోసా..
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు స్వస్తి పలకాలి.. పర్యావరణ హిత వస్తువుల వినియోగం పెంచాలి
డోకిపర్రులో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
డోకిపర్రు (గుడ్లవల్లేరు), ఆంధ్రప్రభ : ప్లాస్టిక్ వినియోగం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, దాని వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పిలుపునిచ్చారు.
స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులతో కలిసి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
“ప్లాస్టిక్ వాడకు – ప్రాణాలు తీయకు”, “ప్లాస్టిక్ బాటిల్ కంటే స్టీల్ బాటిల్ మేలు”, “ప్లాస్టిక్ బ్యాగ్ వద్దు – క్లాత్ బ్యాగ్ ముద్దు” వంటి నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని సూచించారు.
అనంతరం నిర్వహించిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తోందన్నారు. వేడి టీ, కాఫీ వంటి పానీయాలను ప్లాస్టిక్ కప్పులు, కవర్లలో తీసుకోవడం వల్ల అందులోని రసాయనాలు ఆహారంలో కలిసిపోయి ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని తెలిపారు.
గతంలో అరుదుగా కనిపించే క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రస్తుతం ఎక్కువ మందిని వేధిస్తున్నాయని, జీవనశైలి మార్పులతో పాటు ప్లాస్టిక్ వినియోగం పెరగడం కూడా ఇందుకు ఒక కారణమని పేర్కొన్నారు.
తన వ్యక్తిగత అనుభవాన్ని గ్రామస్తులతో పంచుకున్న కలెక్టర్, కృష్ణా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రారంభ రోజుల్లో వాహనంలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు వినియోగించేవాడినని, వాటి ప్రభావాన్ని గుర్తించిన తర్వాత స్టీల్ బాటిళ్ల వినియోగాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం తాను ఎక్కడికి వెళ్లినా సాధ్యమైనంత వరకు పర్యావరణ హిత వస్తువులనే ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.
ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే పెద్ద మార్పు సాధ్యమవుతుందని అన్నారు. షాపింగ్‌కు వెళ్లేటప్పుడు క్లాత్ బ్యాగులు, కూరగాయలు, పండ్లు కొనుగోలు చేసే సమయంలో బుట్టలు, హోటళ్ల నుంచి ఆహారం తీసుకువచ్చే సమయంలో స్టీల్ లేదా ఇతర పునర్వినియోగ పాత్రలు తీసుకెళ్లడం వంటి అలవాట్లు పెంపొందించుకోవాలని సూచించారు.
టీ, కాఫీల కోసం ప్లాస్టిక్ కప్పులకు బదులుగా ఫ్లాస్కులు, స్టీల్ పాత్రలను వినియోగించాలని కోరారు. గ్రామ ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ఒక ప్రతిజ్ఞగా తీసుకుని, తమ గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారిణి ఎం. ధనలక్ష్మి, ఎంపీడీవో ఎండి ఇమ్రాన్, డిప్యూటీ ఎంపీడీవో జీఎస్‌ఎస్ అంజనాదేవి, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
