పిచ్చికుక్క స్వైర విహారం..

పిచ్చికుక్క స్వైర విహారం..

  • 11 మందికి గాయాలు..
  • గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే

జగిత్యాల, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పోతారం గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసి 11 మందికి పైగా గాయపరిచింది. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది. గాయపడిన వారిని స్థానికులు వెంటనే జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు.

బాధితులకు అవసరమైన అన్ని మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య వసతులు, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గాయపడిన వారందరికీ రేబీస్ వ్యాక్సిన్ అందించినట్లు చెప్పారు. ప్రభుత్వం వీధి కుక్కలకు వ్యాక్సినేషన్‌తో పాటు సంతాన నియంత్రణ చర్యలు చేపడుతోందని వెల్లడించారు. గ్రామాల్లో సంచరించే అనుమానాస్పద కుక్కల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.