స్వచ్ఛతే స్వర్ణాంధ్రకు బాట..

స్వచ్ఛతే స్వర్ణాంధ్రకు బాట..

ప్లాస్టిక్ నిర్మూలనపై కలెక్టర్ అవగాహన ర్యాలీ

ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి : కలెక్టర్ దినేష్ కుమార్

రంపచోడవరం ఆంధ్రప్రభ: పోలవరం జిల్లాలోని ప్రతి గ్రామంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలవరం (రంపచోడవరం) జిల్లా కలెక్టర్ కే. దినేష్ కుమార్ పేర్కొన్నారు.

శనివారం స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్, చింతూరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి శుభం నోక్వాల్, ఓఎస్‌డీ పంకజ్ కుమార్ మీనా, ఏఎస్పీ బి. హేమంత్, ఆర్డీవో కె. స్వాతి తదితరులు పాల్గొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం అత్యంత అవసరమన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల నేల, నీరు, జీవవైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. పర్యావరణ హిత వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ జిల్లాను స్వచ్ఛమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

ప్రతి గ్రామంలో నిరంతరం పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని, ఆరుబయట మలవిసర్జనకు స్వస్తి పలికి మరుగుదొడ్లను వినియోగించాలని సూచించారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా గ్రామాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రజలు తమ కార్యక్రమంగా భావించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి స్వచ్ఛతపై అవగాహన ర్యాలీ నిర్వహించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డీఎన్‌వీ రమణ, డీడీఓ వెంకటనారాయణ, తహసీల్దార్ సీహెచ్ బాలాజీ, ఎంపీడీవో ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో హరిబాబు, పీహెచ్ఓ దేవాదానం, జిల్లా వ్యవసాయశాఖ అధికారి రామ్మోహన్‌రావు, ఐసీడీఎస్ పీడీ కె. ఉమా, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.