ఇంటర్ అడ్మిషన్ల కోసం ఇంటింటి ప్రచారం..

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ అడ్మిషన్లను పెంపొందించేందుకు అధ్యాపకులు విస్తృత ప్రచారం చేపట్టారు. కళాశాల ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మధుకుమార్ చౌట్‌పల్లి గ్రామంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అడ్మిషన్లపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో చౌట్‌పల్లి గ్రామ సర్పంచ్ మెహబూబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్మర్‌పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్ని సబ్జెక్టులకు పూర్తి స్థాయి అధ్యాపక బృందం అందుబాటులో ఉందని, మండలంలోని పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మధుకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేస్తోందని తెలిపారు. అలాగే త్వరలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులోకి రానుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు పలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు అధిక సంఖ్యలో చేరి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వెంకటేష్, వార్డు సభ్యుడు రిత్విక్ తదితరులు పాల్గొన్నారు.