ప్రజల భాగస్వామ్యంతోనే నేరరహిత సమాజం సాధ్యం

ప్రజల భాగస్వామ్యంతోనే నేరరహిత సమాజం సాధ్యం

– ఎస్ఐ సీహెచ్. సతీష్

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ:
ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత, నేరరహిత సమాజం సాధ్యమవుతుందని కమ్మర్‌పల్లి ఎస్ఐ సీహెచ్. సతీష్ అన్నారు. సోమవారం నర్సాపూర్ గ్రామంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో భాగంగా ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు చట్టాలను గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.

నేరాల నియంత్రణ, ప్రజల రక్షణ, భద్రత, చట్టాలపై అవగాహన, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, యువత సామాజిక బాధ్యత వంటి అంశాలపై వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం ప్రమాదాలకు కారణమవుతాయని పేర్కొని ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మహిళలు, బాలికల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, షీ టీమ్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు.

సైబర్ మోసాలకు గురైతే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు. అనంతరం గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం. నరేష్, గ్రామ సర్పంచ్ బుస్సాపురం సంధ్య, ఉప సర్పంచ్ కట్ట రాజ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి జులేఖ, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

Leave a Reply