పీ-4 స్ఫూర్తితో పేదలకు అండగా పీఈటీ రవికుమార్
పీ-4 స్ఫూర్తితో పేదలకు అండగా పీఈటీ రవికుమార్
ఎడ్లంక–అవనిగడ్డ, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వ మెగా డీఎస్సీలో ఉద్యోగం పొంది తన స్వగ్రామంలోని పేదలకు సాయం చేయడం అభినందనీయమని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. అవనిగడ్డ మండలం ఎడ్లంక పల్లెపాలెంలో పీ-4 కార్యక్రమం కింద గ్రామానికి చెందిన మండవల్లి జడ్పీ హైస్కూల్ ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడు (పీఈటీ) ఒడుగు రవికుమార్ రెండు నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకుని వారికి గృహ వసతి కల్పించేందుకు ముందుకొచ్చారు.
ఎనభై ఏళ్ల వృద్ధురాలు కొక్కిలిగడ్డ సామ్రాజ్యం, పక్షవాత బాధితుడు నాగిడి రామకృష్ణ కుటుంబాల నివాసాలు శిథిలావస్థలో ఉండటంతో వారికి ఒక్కో కుటుంబానికి రూ.3.50 లక్షల చొప్పున మొత్తం రూ.7 లక్షల వ్యయంతో రెండు రేకుల షెడ్ల నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణ పనులకు మండలి వెంకట్రామ్ భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన, బంగారు కుటుంబాల అభివృద్ధి లక్ష్యంగా పీ-4 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ఆ స్ఫూర్తితో రవికుమార్ ముందుకు వచ్చి రెండు పేద కుటుంబాలకు కనీస గృహ వసతి కల్పించేందుకు మార్గదర్శిగా నిలవడం అభినందనీయమన్నారు. ఇటీవల గ్రామ పంచాయతీకి రూ.25 వేల వ్యయంతో 35 ఎల్ఈడీ లైట్లు అందజేయడం కూడా ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు, మాజీ ఉపసర్పంచ్ అడపా శ్రీను, గ్రామ ప్రముఖులు సత్యంబాబు, జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు మోదుమూడి మాధవరావు (భద్రి), కొల్లూరు శ్రీను, కొక్కిలిగడ్డ వీరవసంతరావు తదితరులు పాల్గొన్నారు.
