Political Murder Case | కూటమిపై అమర్‌నాథ్ ఫైర్

Political Murder Case | కూటమిపై అమర్‌నాథ్ ఫైర్

హత్య ఘటనపై రాజకీయ దుమారం

Political Murder Case | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్నది “మేకప్ ప్రభుత్వం” అని వ్యాఖ్యానిస్తూ, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు.

ఇటీవల వెలుగులోకి వచ్చిన యువకుడి హత్య ఘటనపై స్పందించిన ఆయన, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇలాంటి దారుణ ఘటన ఎప్పుడూ చూడలేదన్నారు. ఒక యువకుడిని హత్య చేసి, ఆనవాళ్లు కూడా లేకుండా కాల్చివేసిన ఘటన రాష్ట్ర ప్రజలను కలవరపెడుతోందని పేర్కొన్నారు.

ఈ కేసులో సీఐని బలిపశువుగా చేసి అసలు బాధ్యులను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఐజీ స్థాయి అధికారిపై ఎస్పీతో విచారణ చేయించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ప్రజల భద్రతను కాపాడడంలో విఫలమైందని విమర్శించారు. అలాగే లోకేశ్ “రెడ్ బుక్” వ్యాఖ్యల తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయని ఆరోపించారు.

టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారీ కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా మారుతున్నారని అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.