పీకే పాలెంలో ఘోర అగ్నిప్రమాదం: భారీగా మత్స్యకారుల ఆస్తి నష్టం

పీకే పాలెంలో ఘోర అగ్నిప్రమాదం: భారీగా మత్స్యకారుల ఆస్తి నష్టం

కవిటి, ఆంధ్రప్రభ: మండలంలోని పెద్ద కర్రివానిపాలెం గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మత్స్యకారులకు చెందిన 150కు పైగా చేపల వేట వలలు, రెండు మరబోట్లు అగ్నికి ఆహుతయ్యాయి.

స్థానికుల వివరాల ప్రకారం కర్రి తిరుపతి, కర్రి గోపాలరావు, యువరాజు, కే. తమ్మయ్య, వెంకటేశం, సాగూరు వెంకటేశు, కే. గణపతి, ఎస్. బాబురావు, సాగూరు బాబురావు, కే. రుద్రయ్య, గండిపిల్లి బాబురావు, కర్రి కృష్ణారావుతో పాటు మరికొందరు మత్స్యకారులకు చెందిన వలలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

సమాచారం అందుకున్న ఇచ్చాపురం అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే భారీ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ.70 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కో మత్స్యకారుడికి చెందిన 5 నుంచి 10 వలలు అగ్నికి ఆహుతి కావడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని వారు కోరుతున్నారు.