ఘనంగా పుచ్చలపల్లి వర్ధంతి వేడుకలు…

ఘనంగా పుచ్చలపల్లి వర్ధంతి వేడుకలు…

లావేరు, ఆంధ్రప్రభ : దోపిడీలేని కార్మికవర్గ రాజ్యం కోసం కృషి చేసిన ఆదర్శ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి. సుందరయ్య ఆశయ సాధనకు కృషి చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వి రమణ పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధుడు, దక్షిణ భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సభలు మంగళవారం లావేరు మండలంలో బుడుమూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. తొలిత సుందరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, ప్రకృతికి మేలు చేసే సంకల్పంతో సుందరయ్య ఆచరించిన నిరాడంబరత, పొదుపైన జీవితం నేటి తరానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు.

పలు దఫాలు ఎం.ఎల్.ఎగా, పార్లమెంట్ సభ్యునిగా, నెహ్రూ ప్రధానిగా ఉన్న పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ప్రధాన ప్రతిపక్షనేతగా కార్మిక, రైతాంగ సమస్యలు పరిష్కారం కొరకు ఎంతో కృషి చేశారు. అనేక ఉద్యమాలు, సంఘాలు నిర్మించారు. పిల్లలు పుడితే స్వార్థం పెరుగుతుందని, ప్రజాసేవకు ఎక్కువ సమయం కేటాయించలేమని బిడ్డలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ చేసుకొని తన యావజ్జీవితం ప్రజాసేవకే అంకితం చేశారని అన్నారు.

పార్లమెంటుకు, అసెంబ్లీకి కూడా సైకిల్ పై వెళ్లి అనేక ప్రజా సమస్యల పరిష్కరించిన మహోన్నత నేతని కొనియాడారు.భూస్వామ్య కుటుంబంలో పుట్టిన ఆయనకు ఆస్తిలో వచ్చిన వాటా కూడా ప్రజా ఉద్యమాలకు ఇచ్చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు . ఆయన పూర్తి పేరు సుందరరామిరెడ్డి పేరు తీసేసి సుందరయ్యగా మార్చుకున్నారని అన్నారు. అగ్రకుల భూస్వామ్య రెడ్డి కుటుంబంలో పుట్టినా దళితుల హక్కులు కోసం, కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు.

వ్యవసాయ కార్మిక సంఘం పెట్టి కూలీ రేట్లు పెంపు కొరకు పోరాటం చేశారని అన్నారు. క్రమశిక్షణ, త్యాగనిరతి, అధ్యయనం, ఆచరణ, నిర్మాణ దక్షత ఆయన సొంతమన్నారు. నేటి పరిస్థితుల్లో సుందరయ్య ఎంతో స్ఫూర్తి అని అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య ఆశయసాధనకు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో ఎం.ఆశోక్, పి.నాగరాజు,జె.వెంకట సూరి,ఎల్.చక్రవర్తి, ఎస్.శ్రీను,పి.వెంకటేష్, యు.కాశీ,ఎ . వేణు, ఎస్. రాంబాబు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply