Market | ఐటీ షేర్ల కుప్పకూలింపుతో సూచీల పతనం
Market | ఐటీ షేర్ల కుప్పకూలింపుతో సూచీల పతనం
నిఫ్టీ 24 వేల దిగువకు.. మదుపర్లలో ఆందోళన
Market | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో బెంచ్‌మార్క్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి.
ఉదయం 9:50 గంటల సమయానికి సెన్సెక్స్ 721.13 పాయింట్లు లేదా 0.93 శాతం క్షీణించి 76,688.84 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 197.60 పాయింట్లు లేదా 0.82 శాతం పడిపోయి 23,970.40 వద్ద కొనసాగుతోంది. దీంతో నిఫ్టీ మళ్లీ 24 వేల మార్క్ దిగువకు చేరింది.
నిఫ్టీ-50 సూచీలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్లు అత్యధిక నష్టాలను నమోదు చేశాయి. ఐటీ రంగంలో భారీ అమ్మకాలు కొనసాగడంతో నిఫ్టీ ఐటీ సూచీ దాదాపు 6 శాతం వరకు క్షీణించింది.
విస్తృత మార్కెట్లలోనూ బలహీనత కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 0.55 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీ 0.19 శాతం మేర నష్టపోయాయి. రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలకు చెందిన షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అయితే ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల షేర్లు కొంత మేర మెరుగైన ప్రదర్శన కనబరిచి మార్కెట్‌కు మద్దతుగా నిలిచాయి.
