దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన రాహుల్ గాంధీ..
దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన రాహుల్ గాంధీ..
నేటి తరం యువతకు ఆదర్శప్రాయం.
రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ షర్మిల
విజయవాడ, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి విలువల పట్ల రాహుల్ గాంధీకి ఉన్న అంకితభావాన్ని తాను ఎప్పుడూ అభిమానిస్తానని పేర్కొన్నారు. రాజకీయాల్లో ధైర్యం, నిబద్ధత అవసరమైన ఈ కాలంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఆయన నిలబడుతున్నారని కొనియాడారు.
దేశం కోసం అసాధారణ త్యాగాలు చేసిన కుటుంబ వారసత్వాన్ని రాహుల్ గాంధీ వినయంతో, అంకితభావంతో ముందుకు తీసుకెళ్తున్నారని షర్మిల అన్నారు. భారతదేశాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించే ఆదర్శ నాయకుడిగా రాహుల్ గాంధీని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాహుల్ గాంధీకి మంచి ఆరోగ్యం, ఆనందం, శక్తి, ప్రజాసేవలో మరిన్ని విజయాలు కలగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
