మూసీ అభివృద్ధికి సహకరించాలి..: సీఎం రేవంత్
ఆంధ్రప్రభ : మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. మూసీ నది అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు.. కొందరు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, మూసీని ఆధునిక నగర అభివృద్ధికి అనుగుణంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యానికి అందరూ సహకరించాలని కోరారు.
మూసీ పునరుజ్జీవనంతో పాటు హైదరాబాద్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు. దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, ఆధునిక జీవన విధానానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.
భావితరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పురోగతికి దోహదపడే ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షాలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టించడం కంటే ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సహకరించడం మంచిదని వ్యాఖ్యానించారు.
