ఉన్నతంగా ఎదిగేందుకు చదువే వజ్రాయుధం

  • విద్యార్థులు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
  • జోయాలుకాస్ సామాజిక సేవలు అభినందనీయం
  • జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ రామోజీ రమేష్

ఖమ్మం ఎడ్యుకేషన్, ఆంధ్రప్రభ: విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేందుకు చదువే వజ్రాయుధమని జిల్లా ఇంటెలిజెన్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రామోజీ రమేష్ తెలిపారు.స్థానిక జోయాలుకాస్ బంగారు ఆభరణాల ప్రదర్శనశాలలో గురువారం సంభానినగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన 100 మంది విద్యార్థులకు ఎస్పీ రామోజీ రమేష్ చేతుల మీదుగా పాఠశాల సంచులు, భోజన పెట్టెలు, నీటి సీసాలు, నోట్ పుస్తకాలు, గొడుగులు, జ్యామితి పెట్టెలు పంపిణీ చేశారు.

జోయాలుకాస్ సంస్థ సహాయ కార్యక్రమాల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ, విద్యార్థులు తమకు లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఇతరులకు సహాయం చేసే గుణాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు.జోయాలుకాస్ సంస్థ సామాజిక బాధ్యత కార్యక్రమాల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

మాజీ సైనిక ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్.ఎం. అరుణ్ మాట్లాడుతూ, దాదాపు రూ.3 లక్షల విలువైన విద్యా సామగ్రిని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించడం హర్షణీయమన్నారు.సంభానినగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గౌరీ, సీనియర్ ఉపాధ్యాయురాలు సూర్యకుమారి మాట్లాడుతూ, తమ పాఠశాలను ఎంపిక చేసి విద్యార్థులకు పాఠశాల సంచులు, విద్యా సామగ్రి అందించిన జోయాలుకాస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ సీఐ సీహెచ్ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు గౌరీ, ఉపాధ్యాయులు సూర్యకుమారి, పర్వీన్, మీనా, శాంతినగర్ పాఠశాల సముదాయం ప్రధానోపాధ్యాయుడు చల్లగాని కృపాబాలానందం, హైకోర్టు న్యాయవాది నాళ్ల భానుచందర్, జోయాలుకాస్ ఉద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.