KHM | విద్యాభివృద్ధికి తీసుకున్న చర్యలేంటి…? ఖమ్మం ఎంపీ
ఖమ్మం: దేశంలో విద్యాపరంగా వెనుకబడిన జిల్లాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు, అక్కడ విద్యాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు చేపడుతోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మంగళవారం లోక్ సభలో ప్రశ్నించారు. ఇంకా.. గత ఐదేళ్ల కాలంలో విద్యాపరంగా వెనుకబడిన ఎన్ని జిల్లాలను గుర్తించారని, తాజా జనాభా లెక్కల ప్రకారం ఆయా జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ నిష్పత్తి ఏ విధంగా ఉందని ఎంపీ ప్రశ్నలు సంధించారు. దీనికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల సహాయ మంత్రి జయంత్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
విద్యాపరంగా వెనుకబడిన జిల్లాలు దేశవ్యాప్తంగా 112 ఉన్నాయని.. అందులో తెలంగాణ నుంచి మూడు జిల్లాలు ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం ఉన్నాయని తెలిపారు. విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందేలా, విభిన్న విద్యా సామర్ధ్యాలు పెంపొందించేలా 2018లో నీతి ఆయోగ్ ద్వారా కార్యక్రమాలు చేపట్టామని, 2020 నుంచి సమగ్ర శిక్షా పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా 1,182 రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. వీటిల్లో నాణ్యతను పెంపొందించేందుకు 194 హాస్టళ్లకు రూ.476.16 కోట్లు ఆమోదించినట్లు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, వెనుకబడిన వర్గాల బాలికల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలైన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కీజీబీవీ) లు ప్రవేశపెట్టినట్లు వివరించారు. దేశవ్యాప్తంగా 5,133 కీజీబీవీ పాఠశాలల్లో ప్రస్తుతం 1.93 లక్షల మంది ఎస్సీ విద్యార్థులు, 1.83 లక్షల ఎస్టీ, 46,858 మంది పేదపిల్లలు, 2.59 లక్షల ఓబీసీ, 28,761 మంది ముస్లిం విద్యార్థులు చదువుతున్నట్లు తెలిపారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం నేషనల్ మీన్స్, కం మెరిట్ స్కాలర్షిప్ పథకం అమలు చేస్తున్నామని, ఎంపికైన వారికి ఏడాదికి రూ.12,000 మంజూరు చేసి విద్యాభివృద్ధికి ప్రోత్సహిస్తున్నామని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డికి కేంద్రమంత్రి వివరించారు.