Macau Open-2026 | భారత షట్లర్ల జోరు..

  • ప్రీక్వార్టర్స్‌కు ముగ్గురు భారత మహిళలు

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : మకావు ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళల సింగిల్స్ షట్లర్లు మెరుగైన ప్రదర్శనతో ప్రీక్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. అన్మోల్ ఖర్బ్, రక్షిత శ్రీ రామ్‌రాజ్, శ్రీయాన్షి వాలిశెట్టి తమ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో విజయం సాధించి చివరి-16లో చోటు దక్కించుకున్నారు.

ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగిన అన్మోల్ ఖర్బ్ ఇండోనేషియాకు చెందిన ముతియారా ఆయు పుస్పితాసరిపై 21-13, 21-16 తేడాతో నేరుగా గెలిచి ప్రీక్వార్టర్స్‌కు చేరింది. 42 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో అన్మోల్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తదుపరి రౌండ్‌లో ఆమె మలేషియాకు చెందిన గోహ్ జిన్ వీతో తలపడనుంది.

మరో భారత షట్లర్ రక్షిత శ్రీ రామ్‌రాజ్ మలేషియాకు చెందిన కిసోనా సెల్వదురాయ్‌పై 21-16, 24-22తో విజయం సాధించింది. ఇక శ్రీయాన్షి వాలిశెట్టి ఆల్ ఇండియా పోరులో తస్నిమ్ మీర్‌ను 21-18, 19-21, 21-15తో ఓడించి ప్రీక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. అయితే భారత క్రీడాకారిణులు శ్రేయా లేలే, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్‌లోనే పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.

పురుషుల సింగిల్స్‌లో రౌనక్ చౌహాన్ అద్భుతంగా పుంజుకుని చైనీస్ తైపీకి చెందిన వూ జె యింగ్‌పై 18-21, 21-15, 21-19తో విజయం సాధించి ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. అయితే ఎస్. శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ మాత్రం పరాజయంతో టోర్నీకి వీడ్కోలు పలికాడు.

మిక్స్‌డ్ డబుల్స్‌లో ఇషాన్ భట్నాగర్ – శృతి మిశ్రా జోడీ జర్మనీ జంటపై 21-4, 21-6తో సునాయాస విజయం సాధించి ప్రీక్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. మిగతా భారత జోడీలు మాత్రం తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాయి.