మృత్యువుకు ఎంత దగ్గరగా వచ్చాం? | ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం

ఆంధ్రప్రభ : ఈ రోజు ఉదయం 9 గంటలకే బయటకు అడుగుపెడితే చాలు.. ఎండ చర్మాన్ని కాల్చేస్తోంది. రోడ్లు నిప్పులు కక్కుతున్నాయి. ఫ్యాన్ గాలి సరిపోవడం లేదు. ఏసీ లేనిదే బతకలేమేమో అనిపించే పరిస్థితి ఏర్పడింది. కానీ ఒక్కసారి ఆలోచించండి.. మన చిన్ననాటి వేసవులు ఇలాగే ఉండేవా? ఇంటి ముందు వేపచెట్టు నీడ ఉండేది. పాఠశాల నుంచి వస్తూ మర్రిచెట్టు కింద ఆగి ఊపిరి పీల్చుకునేవాళ్లం.

గ్రామాల్లో చెరువులు, తోటలు, పచ్చని పొలాలు కనిపించేవి. ఇప్పుడు వాటి స్థానంలో కాంక్రీట్ అడ‌వులు, బహుళ అంతస్తుల భవనాలు, వేడిని వెదజల్లే రహదారులు కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు మనం అనుభవిస్తున్నది కేవలం వేసవి కాదు.. ప్రకృతితో మన సంబంధం ఎంత దూరమైందో, అభివృద్ధి పేరుతో ఎంతటి మూల్యం చెల్లిస్తున్నామో గుర్తు చేస్తున్న సందేశం అంటున్నారు వాతావ‌ర‌ణ నిపుణులు.

నిప్పులు కక్కుతున్న భూమి…

గత పదేళ్లు మానవ చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదయ్యాయని ప్రపంచ వాతావరణ సంస్థలు చెబుతున్నాయి. భారతదేశంలో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు సాధారణమైపోతుండగా, కొన్ని ప్రాంతాల్లో 49 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఒకప్పుడు మే నెలలో మాత్రమే కనిపించే తీవ్ర ఎండలు.. ఇప్పుడు మార్చి నుంచే మొదలవుతున్నాయి. హీట్‌వేవ్‌లు మరింత తీవ్రంగా, మరింత తరచుగా వస్తున్నాయి. వైద్య నిపుణుల హెచ్చరికల ప్రకారం అత్యధిక ఉష్ణోగ్రతలు మానవ శరీరాన్ని ప్రమాద స్థితిలోకి నెట్టే అవకాశం ఉంది. వృద్ధులు, చిన్నారులు, బయట పనిచేసే కార్మికులు ఎక్కువ ప్రమాదంలో ఉంటున్నారు.

వేడి పెరుగుతున్న కొద్దీ ఏసీల వినియోగం కూడా పెరుగుతోంది. కానీ అది శాశ్వత పరిష్కారం కాదు. గదిలోని వేడిని బయటకు పంపే ఏసీలు నగరాలను మరింత వేడెక్కిస్తున్నాయి. అంతేకాదు, విద్యుత్ వినియోగం పెరగడం వల్ల బొగ్గు వంటి శిలాజ ఇంధనాల వినియోగం కూడా పెరుగుతోంది. అంటే మనం చల్లదనం కోసం ప్రయత్నిస్తూనే భూమిని మరింత వేడెక్కిస్తున్నాం.

చెట్లు లేకపోతే భవిష్యత్తు లేదు…

భూమిని సహజంగా చల్లబరచగలిగే యంత్రం చెట్లే అని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఒక పెద్ద చెట్టు కేవలం నీడనే కాదు.. గాలిని చల్లబరుస్తుంది, కార్బన్ డైఆక్సైడ్‌ను గ్రహిస్తుంది, భూగర్భ జలాలను పెంచుతుంది, పక్షులకు ఆశ్రయం ఇస్తుంది, వర్షాలకు అనుకూల పరిస్థితులు కల్పిస్తుంది.

కానీ అభివృద్ధి పేరుతో మనం లక్షలాది చెట్లను నరికి వేస్తున్నాం. ఒక చెట్టును నరకడానికి కొన్ని నిమిషాలు చాలు. కానీ అదే స్థాయిలో పెరిగి నీడనివ్వడానికి కనీసం ఐదు నుంచి పది సంవత్సరాలు పడుతుంది. చెట్లు తగ్గిపోవడం వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. అడవులు నాశనం కావడంతో స్థానిక వర్షపాత విధానాలు మారిపోతున్నాయి.

వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశాలు తగ్గిపోవడంతో భూగర్భ జలాలు కూడా క్రమంగా అడుగంటుతున్నాయి. బోర్లు ఎండిపోతున్నాయి. చెరువులు కుంచించుకుపోతున్నాయి. ఒకప్పుడు చెట్లతో నిండిపోయిన ప్రాంతాలు ఇప్పుడు హీట్ ఐలాండ్స్ గా మారుతున్నాయి. నగరాల్లో ఉష్ణోగ్రతలు గ్రామాల కంటే ఎక్కువగా నమోదవడానికి ఇదే ప్రధాన కారణం అంటున్నారు ప‌ర్యావ‌ర‌ణ నిపుణులు.

ఇది ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు…

చెట్లను నాటడం ప్రభుత్వాల పని మాత్రమే కాదు. ప్రతి పౌరుడి బాధ్యత. లక్షల మొక్కలు నాటడం కంటే, నాటిన మొక్కలను బతికించడం చాలా ముఖ్యమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైంది. మొక్కలు నాటడానికి ఇదే సరైన సమయం. ప్రతి వ్యక్తి కనీసం రెండు మొక్కలు నాటాలి. ఇంటి ముందు, పాఠశాలలో, కాలనీలో, ఖాళీ స్థలంలో ఎక్కడైనా నాటవచ్చు. వేప, మర్రి, రావి, చింత, నేరేడు వంటి దేశీయ జాతుల చెట్లను ప్రాధాన్యంగా ఎంచుకోవాలి. అంతకంటే ముఖ్యంగా.. ఆ మొక్కను బతికించాలి. నీళ్లు పోయాలి. కంచె వేయాలి. జంతువుల నుంచి రక్షించాలి. మొక్కను చెట్టుగా మార్చే బాధ్యత తీసుకోవాలి.

మనలో మార్పురాక‌పోతే… ప్రకృతి మనల్ని మార్చేస్తుంది. ఆ మార్పు వరద రూపంలో రావచ్చు. కరువు రూపంలో రావచ్చు. మరింత భయంకరమైన వేడి రూపంలో రావచ్చు. మన పిల్లలకు, భావి త‌రాల‌కు చల్లని నీడ, స్వచ్ఛమైన గాలి, తాగునీరు అందాలంటే ఇప్పుడే చర్యలు ప్రారంభించాలి. ఏసీ రిమోట్‌ను కాసేపు పక్కన పెట్టి.. ఒక మొక్కను చేతిలో పట్టుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రతి ఇంటికి రెండు చెట్లు.. ప్రతి మనిషికి పర్యావరణ బాధ్యత.. అదే భావితరాలకు మనం ఇచ్చే గొప్ప బహుమతి అవుతుంది.

Also Read This : ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం.. వర్షాకాలంలోనూ వాన జాడ లేదు