యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జాబితాలను సరిచూసుకోవాలి

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జాబితాలను సరిచూసుకోవాలి

మార్పులు, చేర్పులకు 24 వరకు అవకాశం.. జిల్లా ప్రజలకు కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ పిలుపు

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లాలోని ప్రజలు తమ కుటుంబ వివరాలను యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జాబితాలో సరిచూసుకుని, అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ కోరారు.

స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18న అన్ని గ్రామ, వార్డు పరిధుల్లో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జాబితాలను ప్రజల పరిశీలన కోసం ప్రదర్శించినట్లు ఆయన తెలిపారు.

జూన్ 19న స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సభలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సభల సందర్భంగా ప్రజలు తమ కుటుంబ వివరాలు, సభ్యుల వివరాలు తదితర అంశాలను పరిశీలించుకోవాలని సూచించారు.

వివరాల్లో ఏవైనా తప్పులు, మార్పులు లేదా చేర్పులు అవసరమైతే దరఖాస్తు రూపంలో ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు సంబంధిత స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల్లో అందజేయవచ్చని తెలిపారు.

అందిన దరఖాస్తుల ఆధారంగా కుల ధ్రువీకరణకు సంబంధించిన అంశాలు మినహా మిగిలిన అన్ని సవరణలను ఈ నెల 26వ తేదీలోపు పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.

కుల వివరాల సవరణకు సంబంధించిన దరఖాస్తులను సంబంధిత నిర్ణయాధికారుల పరిశీలన అనంతరం నిబంధనల ప్రకారం పరిష్కరించనున్నట్లు వివరించారు.

ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేందుకు సరైన కుటుంబ వివరాలు నమోదు కావడం ఎంతో ముఖ్యమని కలెక్టర్ తెలిపారు.

కావున జిల్లాలోని ప్రజలందరూ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జాబితాలను తప్పనిసరిగా పరిశీలించి, అవసరమైన సవరణలు చేసుకోవాలని కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ విజ్ఞప్తి చేశారు.