మహిళలకు 33% రిజర్వేషన్ అభినందనీయం

మహిళలకు 33% రిజర్వేషన్ అభినందనీయం
ఎమ్మెల్యే పరిటాల సునీత
రాప్తాడు, ఆంధ్రప్రభ : గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో కేసులు పెట్టినా, బెదిరింపులు చేసినా, దౌర్జన్యాలు జరిగినా తమ కార్యకర్త భుజంపై ఉన్న తెలుగుదేశం పార్టీ కండువాను కూడా కదిలించలేకపోయారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు.
రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 12 క్లస్టర్ల పరిధిలో మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించగా, ఆరు చోట్లకు ఎమ్మెల్యే సునీత స్వయంగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆత్మకూరు మండల కేంద్రంలోని క్లస్టర్-1లో నియోజకవర్గ పరిశీలకురాలు పద్మలతా రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు తల్లికి గీతాలాపన నిర్వహించి, మృతిచెందిన టీడీపీ కుటుంబ సభ్యులకు నివాళి అర్పించారు.
పాపంపేట, సిండికేట్ నగర్, రాప్తాడు, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి క్లస్టర్లలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అన్ని చోట్ల ఎమ్మెల్యే సునీత జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించడం పట్ల ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మహిళల పక్షాన టీడీపీ ఎప్పటికీ ఉంటుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ మహానాడుకు కచ్చితంగా గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కుతుందని జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వర్షం కురవడం శుభసూచకమని, ప్రజలతో పాటు దేవుని ఆశీస్సులు కూడా ఉన్నాయని తెలిపారు.
