విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

  • ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

జన్నారం రూరల్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామ సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న భోజనశాల భవనానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.

అనంతరం సమీపంలోని వ్యవసాయ శిక్షణ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ బ్యాటరీ సైకిల్‌పై పర్యటించారు. విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలను పంపిణీ చేశారు. తర్వాత కిష్టాపూర్ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి, గ్రామంలోని పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం పేదల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. విద్య, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బక్కయ్య, మండల అభివృద్ధి అధికారి ఉమర్ షరీఫ్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ప్రధానోపాధ్యాయురాలు మామిడి శ్రీవాణి, వ్యవసాయ శిక్షణ కేంద్రం ప్రధానోపాధ్యాయుడు వై. రమేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఫసిహుల్లా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అజ్మీర్ నందునాయక్, గ్రామ సర్పంచి నరేష్, పలువురు సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.