విద్యను వ్యాపారంగా మార్చొద్దు
విద్యను వ్యాపారంగా మార్చొద్దు
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీపై చర్యలు తీసుకోవాలి: ఆర్‌వైఎస్‌ఎఫ్
కర్నూలు, ఆంధ్రప్రభ: జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని రాయలసీమ యువ విద్యార్థి సమాఖ్య (ఆర్‌వైఎస్‌ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు రంగముని నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు కర్నూలు నగరంలోని బి.క్యాంప్‌లో ఆర్‌వైఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రంగముని నాయుడు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అనేక ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు.
పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలు, షూస్, టైలు, బెల్టులు, ఐడీ కార్డులు తదితర వస్తువులను విద్యాసంస్థల ద్వారానే కొనుగోలు చేయాలని బలవంతం చేస్తున్నారని విమర్శించారు.
బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరలకు లభించే వస్తువులను పాఠశాలల ద్వారా అధిక ధరలకు విక్రయిస్తూ వేలాది రూపాయల అదనపు భారం తల్లిదండ్రులపై మోపుతున్నారని పేర్కొన్నారు.
విద్యార్థుల విద్యాభ్యాసం పేరుతో సాగుతున్న ఈ విధమైన ఆర్థిక దోపిడీని ప్రభుత్వం వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ కొన్ని విద్యాసంస్థలు వాటిని పట్టించుకోవడం లేదని అన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యను సేవా రంగంగా భావించాల్సిందిపోయి లాభాపేక్షతో వ్యవహరించడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు.
విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆర్‌వైఎస్‌ఎఫ్ విజ్ఞప్తి చేసింది.
ఈ సమావేశంలో ఆర్‌వైఎస్‌ఎఫ్ నాయకులు రాజేష్, రమణ, దేవేంద్ర, కార్తీక్, విశ్వనాథ్, యుగంధర్, రవి తదితరులు పాల్గొన్నారు.
