అర్హులైన వారినే అదనపు మున్సిపల్ కమిషనర్‌గా నియమించాలి

  • 28వ వార్డు కౌన్సిలర్ జూలూరి రోజారాణి

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ:నర్సంపేట మున్సిపాలిటీలో అదనపు మున్సిపల్ కమిషనర్ నియామకంలో పారదర్శకత పాటించాలని, జిల్లా కలెక్టర్ ఆమోదంతో వచ్చిన అర్హులైన ప్రభుత్వ ఉద్యోగినే నియమించాలని కోరుతూ 28వ వార్డు కౌన్సిలర్ జూలూరి రోజారాణి గురువారం మున్సిపాలిటీ మేనేజర్ శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం నియమించిన అదనపు మున్సిపల్ కమిషనర్‌కు బాధ్యతలు అప్పగించకుండా వెనక్కి పంపడం, తాత్కాలిక పద్ధతిలో అర్హతలు లేని వారిని నియమించేందుకు ప్రయత్నించడం సరైన విధానం కాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను నిబంధనల ప్రకారమే భర్తీ చేయాలని, ఏ అర్హతల ఆధారంగా నియామకాలు చేపడుతున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.

సొంత వ్యక్తులను నియమించి అవకతవకలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల జిల్లా కలెక్టర్ ఆమోదంతో వచ్చిన ప్రభుత్వ సేవకు చెందిన అర్హులైన వ్యక్తినే అదనపు మున్సిపల్ కమిషనర్‌గా నియమించాలని వినతిపత్రంలో డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నర్సంపేట రూరల్ మండల అధ్యక్షుడు తనుగుల అంబేద్కర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సూత్రపు సరిత, కాసుల నాగేంద్రబాబు, ఠాగూర్ విజయ్ సింగ్, చేను నరేష్, ఇతర పార్టీ నాయకులు, 28వ వార్డు ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.